టీఆర్‌ఎస్‌లో నాయకత్వలేమి
గ్రేటర్ ఫలితాలపై అంతర్మథనం
సమన్వయ కమిటీ తీరుపై విమర్శలు
ఇప్పటికైనా స్పందించాలంటున్న శ్రేణులు
వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఫలితాలపై టీఆర్‌ఎస్‌లో అంతర్మథనం మొదలైంది. ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో పార్టీ వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. టీఆర్‌ఎస్ బలంగా ఉన్న గ్రేటర్ వరంగల్‌లో ఘన విజయం సాధించకపోవడానికి కారణాలు ఏమిటని పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా జిల్లాలోని నేతలకు కీలక పదవులు అప్పగించినా... గ్రేటర్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు గెలవలేదనే అభిప్రాయం టీఆర్‌ఎస్‌లో వ్యక్తమవుతోంది. వరంగల్ లోక్‌సభ, గ్రేటర్ హైదరాబాద్, నారాయణఖేడ్ ఎన్నికల ఫలితాలతో టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో జరిగిన గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని పార్టీ వర్గాలు భావించాయి. 58 డివిజన్లలో కనీసం 50 దక్కించుకుంటామని టీఆర్‌ఎస్ జిల్లా ముఖ్యనేతలు ప్రకటించారు.
టీఆర్‌ఎస్ అధిష్టానం సైతం గతానికి భిన్నంగా గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను స్థానిక నేతలకే అప్పగించింది. డివిజన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, రెబల్ అభ్యర్థులకు సర్దిచెప్పడం.. వంటి కీలక వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో ప్రత్యేకంగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎమ్మెల్యేలు టి.రాజయ్య, కొండా సురేఖ, దాస్యం వినయభాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డితోపాటు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ఎమ్మె ల్సీ కొండా మురళీధర్‌రావులను సభ్యులుగా నియమించింది. సమన్వయం కోసం ఏర్పాటైన కమిటీలోని వారే పరస్పరం విభేదించుకున్నారు. టికెట్ల కేటాయింపులో వ్యక్తిగత ఇష్టాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నామినేషన్ల దాఖలు గడువు చివరి రోజు వరకూ సమన్వయ కమిటీ టికెట్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయలేకపోయింది. పరిస్థితిని గమనించిన టీఆర్‌ఎస్ అధిష్టానం వెంటనే స్పందించి మంత్రి తన్నీరు హరీశ్‌రావును వరంగల్‌కు పంపిం చింది. హరీశ్‌రావు కొద్ది సమయంలోనే టికెట్ల పం పిణీ ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించడం, ప్రచారం వ్యూహంలోనూ సమన్వయ కమిటీ చేతులెత్తేయగా.. ఆ బాధ్యతలను కూడా ఆయనే చక్కబెట్టాల్సి వచ్చింది. ప్రచా ర గడువు ముగిసే వరకు హన్మకొండలోనే మకాం వేసి ఎన్నికలను నడిపించారు. దాదాపు అన్ని డివి జన్లలోనూ ప్రచారం చేశారు. దీంతో పరిస్థితి కొంత చక్కబడింది.
మిగతా చోట్ల స్థానిక మంత్రులకే...
గ్రేటర్ వరంగల్‌తోపాటు ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగా యి. రెండు జిల్లాల్లోనూ స్థానిక మంత్రులే ఎన్నికల వ్యూహాన్ని చక్కబెట్టారు. ఇదే తరహాలో గ్రేటర్ ఎన్నికల్లో మొదటిసారిగా జిల్లా నేతలకు వ్యూహరచన బాధ్యతలను టీఆర్‌ఎస్ అధిష్టానం అప్పగిం చింది. ఇక్కడి సమన్వయ కమిటీ టికెట్ల ఎంపికలోనే చేతులెత్తేసింది. కీలక పదవుల్లో ఉన్న నేతలు ఎక్కువ మంది ఉన్నా గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ల పం పిణీ సైతం చేయలేని స్థితి ఉండడం దయనీయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సమన్వయ కమిటీ సభ్యులు ఎవరికి వారు తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంపైనే దృష్టి పెట్టారని, పార్టీ గురించి పట్టించుకోలేదని గులాబీ శ్రేణులు అంటున్నాయి. ముఖ్య నేతలు పట్టుబట్టి టికెట్ ఇప్పించుకున్న డివిజన్లలోనూ పార్టీని గెలిపించలేకపోయారని కొందరు గుర్తు చేస్తున్నారు. సమన్వయ కమిటీ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన వర్గీయులకు టికెట్లు ఇప్పించుకున్న 52, 53 డివిజన్లలో టీఆర్‌ఎస్ రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కమిటీ సభ్యుడైన ఎమ్మెల్సీ కొండా మురళీ టికెట్ ఇప్పించిన 13, 15 డివిజన్లలోనూ ఇదే ఫలితం వచ్చింది. ఇలా సమన్వయ కమిటీ సభ్యులు తమ వారి కోసం ప్రయత్నించిన కారణంగా టీఆర్‌ఎస్ ఐదారు డివిజన్లను కోల్పోవాల్సి వచ్చిందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి వరంగల్ జిల్లాలో బలంగా ఉంది. అన్ని ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. 2010 ఉప ఎన్నికల నుంచి టీఆర్‌ఎస్‌కు వరుసగా ఘన విజయాలే నమోదవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ ఫలితాలు ఆ పరిస్థితి లేకుండా చేశాయి. జిల్లాలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు, పార్టీ ముఖ్య నేతలను సమన్వయం చేసేందుకు చొరవ తీసుకునే కీలక నేత ఎవరూ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారుు. ప్రతి ఎన్నికలకు హరీశ్‌రావు వరంగల్ జిల్లాకు వచ్చే పరిస్థితి ఉండబోదని... ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బం దులు వస్తాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
నడిపించే నాథుడేడి ?
Published Mon, Mar 14 2016 1:11 AM | Last Updated on Tue, Aug 21 2018 12:18 PM
Advertisement