వరంగల్ టీఆర్‌ఎస్‌లో ముసలం
♦ గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టికెట్ల లొల్లి
♦ అజ్ఞాతంలోకి పశ్చిమ ఎమ్మెల్యే వినయ్
♦ వలస నేతలకు టికెట్లపై అసంతృప్తి
♦ నామినేషన్ల వేళ పార్టీలో గందరగోళం
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తరుణంలో అధికార టీఆర్‌ఎస్‌లో ముసలం మొదలైంది. పార్టీలోకి కొత్తగా వస్తున్న వారికి కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని టీఆర్‌ఎస్ అధిష్టానం హామీ ఇస్తుండడం పై గులాబీ నేతలు మండిపడుతున్నారు. మొదటి నుంచి పని చేస్తున్న వారికి అవకాశాలు కల్పించలేకపోతున్నామనే భావనతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అసంతృప్తితో ఉన్నారు. వరంగల్ జిల్లాలో ఇటీవల రాజకీయ పరిణామాలతో వినయభాస్కర్ బాగా కలత చెందారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
వినయ్‌భాస్కర్ టీడీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరితో ఇబ్బందుల పడి 12 ఏళ్ల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న తన ఇంటిపై పోలీ సులతో దాడి చేయించేందుకు కారణమైన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరడంపై వినయభాస్కర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎర్రబెల్లి, వినయభాస్కర్ నియోజకవర్గాలు వేరైనప్పడు ఒకే పార్టీలో ఉన్నా ఇబ్బం దులు ఉండబోవని సన్నిహితులు సూచించడంతో కొంత సర్దుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ వరంగల్ నగర పార్టీ అధ్యక్షుడు అనిశెట్టి మురళీ మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఎర్రబెల్లి అనుచరుడిగా ఉన్న మురళికి కార్పొరేటర్ టికెట్ ఇస్తానని టీఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. వరంగల్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ సైతం నాలుగు రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈయనకు కూడా టికెట్ ఇవ్వాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. వీరితోపాటు టీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలకు సైతం టిక్కెట్లపై హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి పని చేస్తున్న వారి నుంచి వినయభాస్కర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఎర్రబెల్లి అనుచరులకు టికెట్ల కేటాయింపుపై, కొత్త వారి రాక తో ఏర్పడిన ఇబ్బందులపై గ్రేటర్ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వద్ద వినయభాస్కర్ సోమవారంరాత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం మేరకు సర్దుకోవాలని కడియం శ్రీహరి చెప్పినట్లు తెలిసింది. మరోవైపు తన అనుచరుల నుంచి టికెట్ల కోసం ఒత్తిడి పెరుగుతుండడంతో వినయభాస్కర్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వదిలేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగియనుంది. కీలకమైన తరుణంలో వినయభాస్కర్ ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడంతో టీఆర్‌ఎస్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.