మేయర్.. నరేందర్
డిప్యూటీ మేయర్‌గా సిరాజొద్దీన్
ప్రకటించిన టీఆర్‌ఎస్ అధిష్టానం
నేడు కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నిక
ఉదయం కార్పొరేటర్ల భేటీ : తక్కెళ్లపల్లి
వరంగల్ : కార్యకర్తకు గుర్తింపు లభించింది.. విధేయతకు పదవి దక్కింది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం గ్రేటర్ వరంగల్ మేయర్‌గా నన్నపునేని నరేందర్‌ను, డిప్యూటీ మేయర్‌గా ఖాజా సిరాజొద్దీన్‌ను పార్టీ అభ్యర్థులుగా టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్‌ఎస్‌లో కీలకంగా పని చేసిన నన్నపునేని నరేందర్, సిరాజొద్దీన్ ఎంపికపై టీఆర్‌ఎస్‌లో సంతృప్తి వ్యక్తమవుతోంది. గ్రేటర్ వరంగల్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారం జరగనుంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధిష్టానం సోమవారం ఉదయమే మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించింది.
ఇచ్చిన మాట ప్రకారం...
నన్నపునేని నరేందర్ గ్రేటర్ వరంగల్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 19వ డివిజన్ నుంచి ఆయన కార్పొరేటర్‌గా గెలిచారు. టీఆర్‌ఎస్‌లో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన గుర్తింపు నన్నపునేనికి ఉంది. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ వరంగల్ రీజియన్ గౌరవ అధ్యక్షుడిగా నరేందర్ పనిచేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నన్నపనేనికి అవకాశం వచేది. కానీ, కొండా సురేఖ టీఆర్‌ఎస్‌లోకి రావడంతో వరంగల్ తూర్పు టికెట్ ఆమెకు దక్కింది. త్వరలోనే నన్నపునేనికి సరైన గుర్తింపు ఇస్తానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అప్పట్లో మాట ఇచ్చారని, ఇప్పుడు అమలు చేశారని టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎంపికైన ఖాజా సిరాజొద్దీన్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 40 డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. ఆయన టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నారు. పార్టీ వరంగల్ నగర, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశారు.
ఉదయం సమావేశం : తక్కెళ్లపల్లి
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ తరపున గెలిచిన కార్పొరేటర్లతో మంగళవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు తెలిపారు. హన్మకొండలోని హరిత హోటల్‌లో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఎ.చందులాల్, ఎంపీలు పసునూరి దయాకర్, గుండు సుధారాణి, ఎమ్మెల్సీ కొండా మురళీ, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయభాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, టి.రాజయ్య హాజరవుతారని పేర్కొన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై చర్చిస్తామన్నారు.