గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది.
కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధం
11మందితో ఎన్నికల కమిటీ
డీసీసీ చీఫ్ నాయినికి సారథ్యం
వరంగల్ రూరల్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్‌పై జెండా ఎగుర వేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా 11 మంది ముఖ్య నాయకులతో గ్రేటర్ వరంగల్ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కాంగ్రెస్ కమిటీకి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డాక్టర్ గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర నాయకులు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, సీనియర్ నాయకులు మహ్మద్ మహమూద్‌ను సభ్యులుగా నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్జి జెట్టి కుసుమకుమార్, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉన్నారు.