
8:30 గంటలకు తొలి ఫలితం
నేడు గ్రేటర్ వరంగల్ ఓట్ల లెక్కింపు
హన్మకొండ: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు ప్రాతినిధ్యం వహించబోయే ప్రజా ప్రతినిధులెవరో నేడు తేలనుంది. ఈ నెల 6న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం ఏనుమాముల మార్కెట్‌లో జరగనుంది. ఉదయం 8:30 గంటలకు తొలి ఫలితాలు వెలువడుతాయి. మధ్యాహ్నం 2 గంటలకల్లా అన్ని డివిజన్ల ఫలితాలు వస్తాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం ఆరు హాళ్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న 58 డివిజన్లలో పోలైన ఓట్లను పన్నెండు రౌండ్లలో లెక్కించనున్నారు. 1 నుంచి 8 రౌండ్ల వరకు ప్రతీ రౌండ్‌కు ఆరు డివిజన్లు కేటాయించగా 9 , 10 రౌండ్లకు మూడు డివిజన్లు, 11, 12 రౌండ్లకు రెండు డివిజన్లు కేటాయించారు. ఈ డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపును పోలింగ్ బూత్‌ల వారీగా లెక్కిస్తారు. ఒక్కో కౌంటింగ్ హాల్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్ లెక్కింపునకు అరగంట సమయం కేటాయించారు. తొలి రౌండ్ ఉదయం 8గంటలకు మొదలవుతుంది. ఈ రౌండ్‌కు కేటాయించిన ఆరు డివిజన్ల ఫలితాలు 8:30 గంటలకు వెల్లడవుతాయి. ఇలా ప్రతీ అర గంటకు ఆరు డివిజన్ల వంతున మధ్యాహ్నం 2గంటలకు 58 డివిజన్ల ఫలితాలు వెల్లడవుతాయి.
తొలి, చివరి ఫలితాలు ఇక్కడ..
గ్రేటర్ వరంగల్‌లో 1వ డివిజన్ ఫలితం తొలిరౌండ్‌లో వెలువడనుంది. ఈ డివిజన్‌లో మొత్తం 14 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవీందర్ బరిలో ఉన్న 20 డివిజన్ ఫలితం చివరగా వెల్లడికానుంది. ఇక్కడ 8 పోలింగ్ బూత్‌లకు సంబంధించి ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు 1, 9, 21, 33, 41, 49 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు చివరి రౌండ్ లెక్కింపు మొదలవుతుంది. ఈ రౌండ్‌లో 20, 32 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపును చేపడతారు. మొత్తంగా మధ్యాహ్నం 2గంటలకు అ న్ని డివిజన్లకు సంబంధించిన లెక్కింపు పూర్తవుతుంది.
390 మంది సిబ్బంది
ఏనుమాముల మార్కెట్‌లో చేపట్టనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు 390 మంది సిబ్బందిని నియమించారు. వీరంతా బు ధవారం ఉదయం 6గంటలకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 7గంటలకు స్ట్రాం గ్‌రూమ్ గదులు తెరుస్తారు. కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఎలక్ట్రానిక్ ఓటిం గ్ మిషన్ల సీల్ సరిగా ఉందా లేదా అనే విషయాన్ని కౌంటింగ్ ఏజెంట్ల సమక్షం లో రికార్డు చేస్తారు. ఈవీఎంలలో ఏమై నా లోపాలు తలెత్తితే రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్తే, నిపుణుల సహాయంతో సాంకేతిక లోపాలను సరిచేస్తారు. ఒక్కో కౌంటింగ్ హాలుకు 14 మంది కౌటింగ్ సూపర్‌వైజర్లు, 14 మంది సహాయకులను నియమించారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించేందుకు 12 మంది, సీలింగ్ స్టాఫ్‌గా మరో 66 మం ది సిబ్బంది లెక్కింపు విధుల్లో పాల్గొంటున్నారు.
బరిలో 398 మంది
గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న 58 డివిజన్లకు సంబంధించి అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు, స్వతంత్రులు కలిసి మొత్తం 398 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 6న ఎన్నికలు జరగగా 60.28 శాతం ఓటింగ్ నమోదైంది. గ్రేటర్ పరిధిలో 6,43,196 మంది ఓటర్లు ఉండగా.. 3,87,725 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు.
ఈ డివిజన్లపైనే ఆసక్తి..
గ్రేటర్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కొన్ని డివిజన్ల ఫలితాలపై సర్వ త్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా గెలుపుకోసం తీవ్రంగా శ్రమించిన టీఆర్‌ఎస్ రెబల్స్, స్వతంత్రులు పోటీ చేసిన డివిజ న్ల ఫలితాలు ఎప్పుడెప్పుడా అనే ఆత్రు త నెలకొంది. వీటిలో 15వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న శారదా జోషి అధికార పార్టీకి గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ డివిజన్‌ను లెక్కింపు ఏడో రౌండ్‌లో మొదలవుతుంది. ఫలితం 11:30 గంటలకు వెల్లడవుతుంది. అదేవిధంగా 13వ డివిజన్ ఫలితం ఐదో రౌండ్‌లో వెల్లడవుతుంది. ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థికి, స్వతంత్ర అభ్యర్థి ఓని భాస్కర్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. దీని ఫలితం ఉదయం 10:30 గంటలకు వెల్లడవుతుంది. మేయర్ బరిలో ఉన్న ముఖ్యనేత నన్నపునేని నరేందర్ 19వ డివిజన్ నుంచి పోటీ చేశారు. ఈ డివిజన్ ఫలితం మధ్యాహ్నం 1:30 గంటలకు వెల్లడవుతుంది. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య పోటాపోటీగా నడిచిన 26వ డివిజన్ ఫలితం ఉదయం 11 గంటలకు వస్తుంది.