హోరుగల్లు | Greater election campaign rages | Sakshi
Sakshi News home page

హోరుగల్లు

Published Thu, Mar 3 2016 2:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Greater election campaign rages

ఉధృతంగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం
నగరాన్ని చుట్టేస్తున్న హరీశ్
రెండు రోజుల్లో 36 డివిజన్లు పూర్తి
బీజేపీ తరఫున కిషన్‌రెడ్డి ప్రచారం
రంగంలోకి దిగిన పీసీసీ చీఫ్ ఉత్తమ్
నగరంలో రేవంత్‌రెడ్డి రోడ్‌షో

 
 వరంగల్ : ప్రధాన పార్టీల ప్రచార హోరుతో గ్రేటర్ వరంగల్ రాజకీయం వేడెక్కింది. గ్రేటర్‌గా మారిన తర్వాత వరంగల్ నగరంలో మొదటిసారి జరుగుతున్న ఎన్నికలకు పోలింగ్ దగ్గరపడుతోంది. 6వ తేదీన ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. శుక్రవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుండడంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. గెలుపుపై ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్ అన్ని డివిజన్లలో విజయం సాధించాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఆ పార్టీలో ఎన్నికల స్పెషలిస్టుగా పేరున్న మంత్రి తన్నీరు హరీశ్‌రావు కీలకంగా పనిచేస్తున్నారు. టికెట్ల ఖరారు  విషయం నుంచి ప్రచార వ్యూహం వరకు అంతా తానై వ్యవహరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు సంబంధించి ఏ డివిజన్‌లోనూ ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. పార్టీ తిరుగుబాటు అభ్యర్థులకు సర్దిచెప్పడం వంటి పనులను మొదటే చక్కబెట్టారు. రెండు రోజులుగా ప్రచారంతో దూకుడు పెంచారు. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 21 డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరుపున ఆయన ప్రచారం చేశారు. బుధవారం 15 డివిజన్లలో ప్రచారం పూర్తి చేశారు.

మిగిలిన డివిజన్లలో గురు, శుక్రవారం ప్రచారం చేయనున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరు, గత ప్రభుత్వాల పనితీరును ప్రజలకు వివరిస్తున్నారు. వరంగల్ ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలనే అంశంపై స్పష్టత ఇస్తూ ప్రసంగిస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పూర్తిగా ప్రచారంలో తలమునకలవుతున్నారు. ప్రచారం ముగిసిన వెంటనే డివిజన్ల వారీగా రోజు వారీ పరిస్థితులను తెలసుకుంటూ ఏం చేయాలనే విషయాలపై ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులకు సూచిస్తున్నారు. మరోవైపు ప్రచారంలో సోషల్ మీడియాను వినియోగించుని గ్రేటర్ ప్రజల మద్దతు కోరుతున్నారు. ముఖ్యంగా వ్యాట్సాప్, ఫేస్‌బుక్‌లతో యువతరానికి మద్దతు కూడగట్టే పనులు చేస్తున్నారు. వాయిస్ మెసేజ్‌లను సైతం వినియోగించుకుంటున్నారు.

రెండు రోజులుగా ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో గట్టిగానే పోరాడుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రెండు రోజలుగా నగరంలో ప్రచారం చేస్తున్నారు. డివిజన్లలో తిరుగుతూ  ప్రజలను ఓటు అడుగుతున్నారు. పార్టీ అభ్యర్థులను, నాయకులను సమన్వయం చేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గురువారం కూడా ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ ఎన్నికల ఇంచార్జీగా వ్యవహరిస్తున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఇక్కడే మాకాం వేసి పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. బుధవారం నగరంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల పరిస్థితిపై కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ముఖ్య నేతలతో సమీక్షించారు. ఒకే రోజు ప్రచారం నిర్వహించి ఖమ్మం ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. కాంగ్రెస్‌లో గ్రేటర్ వరంగల్ ఎన్నికల ఇంచార్జీగా ఉన్న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క రెండు రోజుల క్రితం వరకు ప్రచారం నిర్వహించారు. మళ్లీ గురువారం నగరానికి రానున్నారు. చివరి రెండు రోజులు ప్రచారం నిర్వహించనున్నారు.
     
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నగరానికి వచ్చి ప్రచారంలో పాల్గొని వెళ్లారు. టీడీపీ శాసనసభాపక్షం నాయకుడు ఎ.రేవంత్‌రెడ్డి బుధవారం ఆ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. నగరంలోని పలు డివిజన్లలో రోడ్‌షో నిర్వహించారు. నయీంనగర్, హన్మకొండ చౌరస్తాలలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గురువారం కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
        
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement