
పిలిస్తే ఎవరైనా హైదరాబాద్ వస్తారు..
న్యూఢిల్లీ: సంక్రాంతి రైతుల పండుగ అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పూర్వీకుల సంప్రదాయాలను అందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వెంకయ్య పిలుపునిచ్చారు. గ్రామాలు అభివృద్ధితోనే దేశాభివృద్ధి ఉంటుందని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. మతత్వ శక్తులను దూరం పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎంఐఎం లాంటి మతతత్వ పార్టీని అడ్డుకునేది బీజేపీనే అని అన్నారు.
కేంద్రం సహకారంతోనే నగరాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఏ రాష్ట్రంపైనా కేంద్రానికి వివక్ష లేదని, ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రావడం లేదని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పిలిస్తే ఎవరైనా హైదరాబాద్ వస్తారని వెంకయ్య అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, ప్రధాని తెలంగాణపై వివక్ష చూపుతున్నారనడంలో అర్థం లేదన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల తరలింపుపై రైల్వేశాఖ ముందుగా దృష్టి పెడితే బాగుండేదని వెంకయ్య అభిప్రాయపడ్డారు.