1920 దశకంలోనే విద్యుత్ వెలుగులు నగరవాసులను మైమరిపించాయి. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ప్రస్తుతమున్న మింట్ కాంపౌండ్ ప్రాంగణంలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో థర్మల్ పవర్ స్టేషన్‌ను అన్ని హంగులతో నిర్మించారు. ఈ కేంద్రంలో విద్యుదుత్పత్తికి నాలుగు యూనిట్లు నెలకొల్పారు. అప్పట్లో నిత్యం 200 టన్నుల బొగ్గుతో 22.5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి జంట నగరాలకు సరఫరా చేయడం విశేషం. ఈ విద్యుత్ వెలుగులతో హుస్సేన్ సాగర్ కళకళలాడేది. ఈ కేంద్రాన్ని 1972లో పాక్షికంగా, 1995లో పూర్తిగా తొలగించినట్లు ఆధారాలున్నాయి.