భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగువాడిగా నగర ప్రథమ మేయర్ మాడపాటి హనుమంతరావు కీర్తిని దక్కించుకున్నారు. ఆయన 1955లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 1951లో హైదరాబాద్‌కు ప్రథమ మేయర్‌గా ఎన్నికై తన సేవలను అందించారు.
ఆంధ్ర మహాసభలో కీలకపాత్రను పోషించిన మాడపాటి... తెలంగాణలో తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. పాలకులు తెలుగుభాష పట్ల వివక్ష చూపుతున్న తరుణంలో దాన్ని ప్రతిఘటించారు. తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతిక వికాసానికి ఆయన చేసిన సేవ శ్లాఘనీయం. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయానికి తోడుగా వేమనాంధ్రభాషా నిలయం, మాడపాటి హన్మంతరావు బాలికోన్నత పాఠశాల ఈయన స్థాపించిన సంస్థలే.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మాడపాటి హన్మంతరావు శాసనమండలి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆయన 'ఆంధ్రపితామహ' బిరుదును కూడా అందుకున్న గొప్పవ్యక్తి.