60.28 శాతం పోలింగ్
► ఓటింగ్‌లో ముందువరుసలో విలీన గ్రామాలు
► పశ్చిమ నియోజకవర్గం డివిజన్లలో తక్కువ
► సాయంత్రం వేళ పుంజుకున్న పోలింగ్
► 40వ డివిజన్ టీడీపీ అభ్యర్థి ఓటు గల్లంతు
► కాజీపేటలో లాఠీచార్జి.. నాయకుల ధర్నా
► స్వతంత్ర అభ్యర్థులపై పోలీసుల ప్రతాపం
ఐదు శాతం తక్కువ
వరంగల్ కార్పొరేషన్‌కు 2005లో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఈ సారి పోలింగ్ శాతం తగ్గింది. అప్పుడు 65 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఆదివారం జరిగిన గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో 60.28 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ దాదాపుగా ఐదు శాతం తక్కువగా నమోదైంది.
సాక్షి, హన్మకొండ: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60.28 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3గంటల తర్వాత జోరందుకుంది. విలీన గ్రామాలు, వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న డివిజన్లలో పోలింగ్ ఎక్కువగా జరిగింది. మొత్తంగా రీపోలింగ్‌కు అవకాశం లేకుండా 58 డివిజన్లలో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు నెమ్మదిగా కొనసాగింది. ప్రతీ రెండు గంటలకు కేవలం పది శాతం చొప్పున ఓట్లుపోలవుతూ వచ్చాయి.
అలా మధ్యాహ్నం ఒంటి గంట అయ్యేసరికి కేవలం 32 శాతమే ఓట్లు పోలయ్యాయి. దీంతో యాభైశాతం పోలింగ్ అవడం కష్టం అనిపించింది. కానీ మధ్యాహ్నం 3గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియ పుంజుకుంది. ఇళ్లకు పరిమితమైన ఓటర్లు క్రమంగా పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు.
విలీన గ్రామాలు, తూర్పులో ఎక్కువ
గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లేయడంలో విలీన గ్రామాల ప్రజలు ముందువరుసలో ఉన్నారు. ఆ గ్రామాలకు చెందిన డివిజన్లలో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్న విలీ న గ్రామాల ప్ర జలు తమ ప్ర జాప్రతినిధిని ఎన్నుకునేందు కు ఉత్సాహం చూపించారు. విలీన గ్రామాల తర్వాత వ రంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న డివిజన్లలో ఓటర్లు చురుగ్గా పోలింగ్‌లో పాల్గొన్నారు. తూర్పు పరిధిలో చాలా డివిజన్లలో యాభై శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఓటింగ్ మందకొడిగా సాగింది. ఇక్కడ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. చాలా డివిజన్లలో నలభై నుంచి యాభైశాతం మధ్యలో పోలింగ్ నమోదైంది.
36వ డివిజన్ కు సంబంధించిన పోలింగ్ బూత్‌ను కాజీపేటలో రైల్వేమిక్స్‌డ్ హైస్కూల్‌లో ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ బయట రైల్వే జేఏసీ నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోల్‌చీటీలు పంచుతుండగా ఇక్కడ విధుల్లో ఉన్న ధర్మసాగర్ ఎస్‌ఐ దేవేందర్ ఎటువంటి హెచ్చరికలూ చేయకుండా ఒక్కసారిగా రైల్వే జేఏసీ నేతలు, రాజకీయ పార్టీల నేతలపై లాఠీచార్జీ చేశారు. అకారణంగా లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ రైల్వే జేఏసీ నేతలు పోలింగ్ బూత్ సమీపంలో అరగంట పాటు ధర్నా చేశా రు. సమాచారం తెలుసుకున్న కాజీపేట సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రవీందర్‌కుమార్, స్టేషన్ ఘన్‌పూర్ సీఐ కిషన్ అక్కడికి చేరుకుని ధర్నా చేస్తున్నవారికి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ 44 డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బీజేపీకిమద్దతిస్తున్న స్వతంత్య్ర అభ్యర్థి కుందారపు శ్రీనివాస్‌ను పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు47వ డివిజన్ పరిధిలో గోకుల్‌నగర్ పోచమ్మ దేవాలయం వద్ద టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ ఆ పార్టీకి చెందిన ఈవీ సతీశ్ ఇంటిపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఇంట్లో ఉన్న కుర్చీలను విరగ్గొట్టారు.
40వ డివిజన్‌లో తెలుగుదేశం అభ్యర్థి మారగాని కీర్తి కిరణ్‌గౌడ్ ఓటు గల్లంతైంది. తన డివిజన్‌లో పరిధిలో తన కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు చెందిన 65 ఓట్లు గల్లంతయ్యాయని కీర్తికిరణ్ ఆరోపించారు.15వ డివిజన్ పరిధిలో టీఆర్‌ఎస్ రెబల్‌గా బరిలో ఉన్న శారద భర్త సురేష్ జోషిపై అధికార పార్టీ అభ్యర్థికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సురేష్‌జోషి చేతిపై, ఛాతిలో దెబ్బలు తగిలాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఇంతేజార్‌గంజ్ పోలీసులు సురేష్‌జోషిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు రెండు గంటల పాటు సురేష్‌జోషిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అతని భార్య శారదజోషి, సోదరిలో పాటు పలువురు ధర్నాకు దిగారు. ప్రచారం చేయకుండా ఇంట్లోనే ఉంటామని సురేశ్‌జోషి హామీ ఇవ్వడంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు 13, 20 డివిజన్లలో బరిలో ఉన్న అధికార పార్టీ రెబల్ అభ్యర్థులు, అనుచరులపై అధికార పార్టీ అభ్యర్థికి చెందిన అనుచరులు దాడి చేశారు. ఈ సంఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి.