చెయ్యికి దెబ్బ
టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి సారయ్య
వారం రోజులుగా ద్వితీయశ్రేణి నేతల వలస
గ్రేటర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు కష్టాలు
వరంగల్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నేతల వలసలతో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింటోంది. వారం రోజులుగా కాంగ్రెస్‌కు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మంగళవారం గులాబీ కండువా కప్పుకున్నారు. గ్రేటర్ వరంగల్‌లో కీలక నేతగా ఉన్న బస్వరాజు సారయ్య ఎన్నికల సమయంలో పార్టీని వీడడం కాంగ్రెస్‌కు నష్టమేనని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన సారయ్యకు సీనియర్ కాంగ్రెస్ నేతగా గుర్తింపు ఉంది. 1989లో వరంగల్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోనే కొనసాగారు. 1994లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత 1999, 2004, 2009 సాధారణ ఎన్నికల్లో సారయ్య వరుసగా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2010 నుంచి 2014 వరకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. కార్పొరేటర్‌గా గెలిచి ఎన్నికల రాజకీయాలు మొదలుపెట్టిన సారయ్యకు వరంగల్ నగరంలో కాంగ్రెస్ కీలక నేతగా గుర్తింపు ఉంది. గ్రేటర్ ఎన్నికల తరుణంలో సారయ్య పార్టీకి దూరమవడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. కాంగ్రెస్ వరంగల్ నగర పార్టీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, పలువురు మాజీ కార్పొరేటర్లు కూడా పార్టీని వీడారు. దీంతో కొత్త నేతల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ఇబ్బందులతోనేనా...
మాజీ మంత్రి బస్వరాజు సారయ్య కాంగ్రెస్‌ను వీడుతారనే ప్రచారం కొన్ని నెలలుగా జరుగుతోంది. ఈ ప్రచారాన్ని బస్వరాజు సారయ్య ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నారు. ఇటీవల పరిస్థితిలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీబీసీఐడీ విచారణ జరిపించింది. సీబీసీఐడీ నివేదికల అంశాలు బస్వరాజు సారయ్యకు ప్రతికూలంగా ఉన్నాయనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ సారయ్య కీలకంగా వ్యవహరించ లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కొనసాగింపుగానే సారయ్య టీఆర్‌ఎస్‌లో చేరారని హస్తం పార్టీ నేతలు అంటున్నారు.
సారయ్యతో పాటు పలువురి చేరిక
వరంగల్ : మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సారయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, ఎమ్మెల్యే కొండా సురేఖల ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. సారయ్యతో పాటు కుడా మాజీ చైర్మన్ మూగ రాంమోహ్మన్‌రావు, డాక్టర్ పోలా నటరాజ్, బస్వరాజు కుమారస్వామి, శ్రీమాన్, రోకుల భాస్కర్, తత్తరె లక్ష్మణ్, తోట నవీన్‌కుమార్, నీలారపు రంజిత్‌లతో పాటు పలువురు పార్టీలో చేరారు.