గ్రేటర్‌పై గులాబీ జెండా | TRS to the huge majority | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌పై గులాబీ జెండా

Published Thu, Mar 10 2016 1:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

గ్రేటర్‌పై గులాబీ జెండా - Sakshi

గ్రేటర్‌పై గులాబీ జెండా

టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ
 
మేయర్ పీఠం కైవసం
15 ఏళ్ల తర్వాత సాకారం
సత్తా చాటిన రెబల్స్
కాంగ్రెస్ ఘోర పరాజయం
ఒక్కో స్థానంలో బీజేపీ, సీపీఎం

 
హన్మకొండ: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయభేరీ మోగించింది. లెక్కింపు ప్రారంభమైన తర్వాత ఏ దశలోనూ ప్రత్యర్థి పార్టీలకు అందనంత వేగంతో కారు గుర్తు అభ్యర్థులు విజయం వైపు దూసుకుపోయారు. కారు వేగాన్ని అందుకోలేక  జాతీయ పార్టీలు చేతులెత్తేశాయి. దీంతో తొలిసారిగా మేయర్ పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన మోజార్టీని టీఆర్‌ఎస్ సునాయాసంగా సాధించింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 58 డివిజన్లు ఉండగా.. 44 డివిజన్లలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నాలుగు డివిజన్లలో విజయం సాధించింది. బీజేపీ, సీపీఎంలు ఒక్కో డివిజన్‌లో విజయం సాధించా యి. ఎనిమిది డివిజన్లలో స్వతంత్రులు గెలుపొందారు. గ్రేటర్ ఓట్ల లెక్కింపు ఏనుమాముల మార్కెట్‌లో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. తొలి రౌండ్ నుంచి టీఆర్‌ఎస్.. ప్రత్యర్థి పార్టీలపై ఆధిక్యం కనబరిచింది.

తొలిసారి గులాబీ పార్టీకి అవకాశం
తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ఆవిర్భవించింది. 2005లో వరంగల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో తొలిసారి టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పాలకవర్గం పదవీకాలం ముగిసినప్పటి నుంచి ఐదేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అనంతరం 2015లో వరంగల్ కార్పొరేషన్‌ను గ్రేటర్ వరంగల్‌గా అప్‌గ్రేడ్ చేశారు. గ్రేటర్ హోదాలో తొలిసారిగా ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ మేయర్ పదవి సాధించేందుకు అవసరమైన మోజర్టీ సాధించింది. గ్రేటర్‌లో 58 డివిజన్లు ఉన్నాయి. మేయర్ పదవి పొందాలంటే 30 డివిజన్లలో విజయం సాధించాల్సి ఉండగా.. టీఆర్‌ఎస్ 44 డివిజన్లలో గెలపొందింది. దీంతో టీఆర్‌ఎస్ ఆవిర్భవించిన పదిహేనేళ్లకు కార్పొరేషన్ పాలన పగ్గాలు ఆ పార్టీ చేతుల్లోకి రాబోతున్నాయి. ఈ నెల 15న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.

సత్తా చాటిన రెబల్స్
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌కు, ఆ పార్టీ రెబల్స్‌కు మధ్యనే సాగింది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల మద్దతును ఓట్లుగా మలుచుకోవడంలో విఫలమైన చోట రెబల్స్ సత్తా చాటారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి కొన్ని డివిజన్లలో ముచ్చెమటలు పట్టించారు. ఎక్కువ డివిజన్లలో విజయం సాధించడంలో జాతీయ పార్టీలను సైతం వెనక్కి నెట్టారు. వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులపై విజయం సాధించారు. ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకర్గం పరిధిలో మూడు డివిజన్లలో టీఆర్‌ఎస్‌పై విజయం సాధించిన స్వతంత్రులు.. మరో రెండు డివిజన్లలో రెండో స్థానంలో నిలిచారు. ప్రధాన రాజకీయ పార్టీల కంటే టీఆర్‌ఎస్‌కు రెబల్స్ నుంచే గట్టి ప్రతిఘటన ఎదురుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement