సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు విధానం, సిద్ధాంతం లేకుండా బీజేపీపై కుట్రలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కూటములు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి కుట్రలను పార్టీ శ్రేణులు అడ్డుకోవాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన గ్రేటర్ బీజేపీ పోలింగ్ బూత్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో యుద్ధ సైనికుల్లా పనిచేయాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ సూచించారు.
‘హైదరాబాద్‌లో ప్రతి కార్యకర్త పార్టీ కోసం శ్రమించాలి. ఉట్టి కట్టలేని ఆయన స్వర్గానికి నిచ్చెన వేసినట్లు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తాడట. ప్రజలు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి పెడుతుంది. దేశవ్యాప్తంగా జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి బీజేపీకి వ్యతిరేకంగా కూటములు కుట్రలు చేస్తున్నాయి. వాటిని అడ్డుకుని బీజేపీని గెలిపించాలి.
నరేంద్ర మోదీ గాలి దేశమంతా ఒకే విధంగా ఉంది. తెలంగాణలో పార్టీ గెలవకపోతే తప్పు మనదిగానే జాతీయ పార్టీ భావిస్తుంది. ఇక కాగ్ నివేదిక ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉంది. కాగ్ నివేదిక వచ్చిన నాటి నుంచి టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నేతలు ఎవరూ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ప్రజల సమస్యలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించింది. ఇదే నినాదంతో గ్రేటర్‌లో కార్యకర్తలు ప్రజలలోకి వెళ్లాలి. ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ప్రతి డివిజన్‌లో నిర్వహించాలి’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment