అక్కడ చెల్లని రూపాయి.. ఇక్కడ చెల్లుతుందా?
బీజేపీపై మంత్రి హరీశ్‌రావు ఫైర్
హన్మకొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ లోని అంబర్‌పేట నియోజకవర్గంలో పది కార్పొరేటర్ స్థానాల్లో ఒక్క స్థానంలోనూ బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోలేని వాళ్లు ఇపుడు వరంగల్‌కు వచ్చి నీతులు చెపుతున్నారని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో చెల్లని రూపాయి.. వరంగల్‌లో చెల్లుతుందా అని ఆయన బీజేపీ నేతలను ప్రశ్నిం చారు. ఆదివారం హన్మకొండలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ఆరూరి రమేష్‌లతో కలసి హరీశ్ విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్‌లో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలున్నా.. గ్రేటర్ ఎన్నికల్లో ఐదుగురు కార్పొరేటర్లను కూడా గెలిపించుకోలేకపోయారన్నారు. తెలంగాణలో ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌దేనన్నారు. ఆరిపోతున్న దీపం అధిక వెలుగునిచ్చినట్లుగా టీడీపీ నాయకులు వెకిలి చేష్టలు చేస్తున్నారని, సొల్లు వాగుడు వాగుతున్నారని, అభూతకల్పనలు మాట్లాడుతున్నారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఖమ్మం కార్పొరేషన్‌ను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు.