ఓరుగల్లుకు మరింత గుర్తింపు తెస్తాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి హరీష్‌రావు
కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం బీజేపీ కూడా అన్యాయం చేసింది
తెలంగాణలో టీడీపీ ఆరిపోయే దీపం వరంగల్ నగరవాసులు ఆలోచించాలి
‘గ్రేటర్’ ఎన్నికల టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి హరీశ్‌రావు
గ్రేటర్ వరంగల్ ఎన్నికలు అన్ని రాజకీయపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వీటి తర్వాత రాష్ట్రంలో ఇప్పట్లో చెప్పుకోదగ్గ పెద్ద ఎన్నికలు లేవు. ఈ ఎన్నికల్లో సత్తా చాటడానికి పార్టీలన్నీ వ్యూహాలు పన్నుతున్నారుు. టీఆర్‌ఎస్‌లో ఎన్నికల స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన తన్నీరు హరీశ్‌రావు ఆ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు. నాయకులను, అభ్యర్థులను సమన్వయం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ‘కంటి ముందు అభ్యర్థి ఉన్నాడు.. ఇంటి ముందు ప్రభుత్వ పనితీరు కనిపిస్తోంది.. ఆలోచించి తీర్పు ఇవ్వండి’ అంటూ ఓటర్లను కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికలపై మంత్రి హరీశ్‌రావు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి
వరంగల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉంది. వరంగల్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ ముందుకు వెళ్తోంది. వరంగల్ కార్పొరేషన్‌కు గ్రేటర్ వరంగల్ హోదాను కల్పిం చింది. వరంగల్ నగరం, సమీప ప్రాంతాల్లోని ప్రజల చిరకా ల డిమాండ్‌గా ఉన్న వరంగల్ పోలీస్ కమిషరేట్‌ను ఏర్పా టు చేసింది. వరంగల్‌ను సాంస్కృతిక కేంద్రంగా మార్చేం దుకు రూ.50 కోట్లతో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నాము. హైదరాబాద్ తర్వాత పండ్ల మార్కెట్‌ను ఇక్కడే ఏర్పాటు చే స్తున్నాం. రూ.10 కోట్లతో కూరగాయలు, ఉల్లిగడ్డ మార్కె ట్ ఏర్పాటవుతున్నాయి. మిషన్ కాకతీయలో భాగంగా వరంగల్ భద్రకాళి, వడ్డేపల్లి, చిన్నవడ్డేపల్లి చెరువులను అభివృద్ధి చేసి మినీ ట్యాంక్‌బండ్లుగా మార్చుతున్నాం. కాకతీ యుల కాలంనాటి చెరువులకు పూర్వవైభవం తీసుకొస్తున్నాం.
కేసీఆర్‌కు ఇష్టమైన నగరం
తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు వరంగల్ నగరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అన్ని కీలక దశల్లో వరంగల్ నగరానిది గొప్ప పాత్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్‌కు ప్రాధాన్యత పెంచింది. హైదరాబాద్ తర్వాత అన్నింటికీ వరంగల్ కేంద్రం అనే భావన తెచ్చింది. వరంగల్ నగరానికి ఉన్న చారిత్రాక గుర్తింపును నిలబెట్టేలా ప్రభుత్వం పనిచేస్తోంది. సామాన్య ప్రజలు మెచ్చేలా పరిపాలన సాగించిన కాకతీయ కళా తోరణాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంలో పెట్టి గుర్తింపు తెచ్చాము. గ్రామాలకు ఆయువుపట్టుగా ఉండే చెరువులను అభివృద్ధి చేసే పథకానికి మిషన్ కాకతీయ పేరు పెట్టాము. ముఖ్యమంత్రిగా కేసీఆర్.. హైదరాబాద్ తర్వాత ఎక్కువ రోజులు వరంగల్‌లోనే ఉన్నారు. మూడు రోజులు పేదల మధ్యనే గడిపారు. వరంగల్ అభివృద్ధి కోసం ప్రతి ఏటా రూ.300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని నిర్ణయించారు. ప్రత్యేక శ్రద్ధతో నగరానికి 15 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయించారు.
ఐటీకి మరో కేంద్రంగా..
ఐటీ పరంగా హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. హైదరాబాద్ తర్వాత ఐటీకి మరో కేంద్రంగా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పదిరోజుల క్రితమే మడికొండలో ఐటీ మంత్రి కేటీఆర్ సెయైంట్ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించారు. ఇది ఇక కొనసాగుతోంది. జిల్లాకు చెందిన పొన్నాల లక్ష్మయ్య ఐటీ మంత్రి గా ఉండి వరంగల్‌ను పట్టించుకోలేదు. విద్యాకేంద్రంగా మార్చే విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది. రాష్ట్రంలోని ఏకైక వైద్యవిద్యాలయాన్ని వరంగల్‌లోనే ఏర్పాటు చేస్తున్నాం. దక్షిణ భారతదేశంలో మొదటి గిరిజన యూనివర్సిటీ వరంగల్‌కే మంజూరైంది. సైనిక్‌స్కూల్ రాబోతోంది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వచ్చే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తోంది. వ్యవసాయ, పశుసంవర్థక కాలేజీలు, పరిశోధన సంస్థలను గ్రేటర్ వరంగల్ పరిధిలోనే ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతున్నాయి.
ప్రజలు మావైపే...
తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వ పని తీరును ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్‌ఎస్‌వైపే ఉంటున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు దిగజారు డు రాజకీయాలు చేశారు. అవాకులు చవాకులు పేలారు. వరంగల్ ప్రజలు టీఆర్‌ఎస్‌ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. గ్రేటర్ హైదరాబాద్, నారాయణ్‌ఖేడ్ ఎన్నికల్లోనూ ప్రజలను టీఆర్‌ఎస్‌నే ఆదరించారు. ప్రతిపక్ష పార్టీల నేతల వైఖరి మారడం లేదు. ప్రజల తీర్పును పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వరంగల్‌లోనూ అదే చేస్తున్నారు. అంతిమంగా ప్రజలే తీర్పు చెబుతారు.
బీజేపీని ప్రశ్నించాలి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరంగల్ నగరానికి ఏం చేసిందని ప్రజలు నిలదీయాలి. స్మార్ట్ సిటీ జాబితాలో వరంగల్‌కు చోటు కల్పించకపోవడానికి కారణం ఎవరో బీజేపీ సమాధానం చెప్పాలి. తెలుగువాడినని చెప్పుకుంటున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు... ఏపీలోని రెండు నగరాలను స్మార్ట్‌సిటీలుగా ఎంపిక చేసినా తెలంగాణలోని వరంగల్‌ను పట్టించుకోలేదు. రైల్వే బడ్జెట్‌లోనూ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. రైల్వే వ్యాగన్, కోచ్ ఫ్యాక్టరీల విషయా న్ని మాట మాత్రంగానైనా ప్రస్తావించలేదు. వరంగల్‌కు ఏమీ చేయని బీజేపీకి ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదు.
కాంగ్రెస్, టీడీపీలు పట్టించుకోలేదు...
చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్‌ను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. 65 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీలు వరంగల్‌ను పట్టించుకోలేదు. కాంగ్రెస్ పాలనలో వరంగల్ నగరంలో ప్రతి రోజూ నాలుగు గంటలు కరెంటు పోయేది. కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఏం చెప్పి ప్రజలను ఓట్లు అడగాలనేది వారికి అర్థంకావడం లేదు. టీడీపీ తెలంగాణలో ఆరిపోయే దీపం. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయడే తన వల్ల కాదని హైదరాబాద్‌ను విడిచి వెళ్లిపోయాడు. తెలంగాణలో టీడీపీకి మనుగడే లేదనే ఆవేదనతో ఆ పార్టీలో మిలిగిన కొందరు నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ప్రజలకు ఏం చేస్తామనే చెప్పకుండా దిగజారి మాట్లాడుతున్నారు.
గుండె మీద చెయ్యి వేసుకుని...
వరంగల్ ప్రజలు మేధావులు, విజ్ఞానవంతులు. పోరాటాల చరిత్ర ఉన్నవారు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచా రు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అన్ని దశల్లోనూ మద్దతు ఇ చ్చారు. గ్రేటర్ వరంగల్‌లోని 58 డివిజన్లలో 42 చోట్ల తెలంగాణ ఉద్యమకారులకే టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చింది. కంటి ముందు అభ్యర్థి ఉన్నాడు.. ఇంటి ముందు ప్రభుత్వ పనితీ రు కనిపిస్తోంది. వరంగల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. గుండెమీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. 65ఏళ్ల గత ప్రభుత్వాల పనితీరు, 20 నెలల టీఆర్‌ఎస్ అంకితభావాన్ని పరిశీ లించండి. సీఎం కేసీఆర్‌కు మద్దతు ఇవ్వడం అంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి మద్దతు ఇచ్చినట్లే. వరంగల్ నగరంపై టీఆర్‌ఎస్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.