ఎవరికి వారే !
టీఆర్‌ఎస్‌లో అయోమయం
ఊసే లేని జిల్లా కమిటీ ఏర్పాటు
ఆత్మీయ విందు భేటీ కూడా..
కేసీఆర్ ఆదేశాలు పట్టని {పజాప్రతినిధులు
‘గులాబీ నేతల్లో’ అసంతృప్తి
వరంగల్ : టీఆర్‌ఎస్ పార్టీలో అమోయమం నెలకొంది. పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారు ఇప్పుడు పదవుల కోసం పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రస్థాయి పదవులను పక్కనబెడితే జిల్లాస్థాయిలో కనీసం 50 ముఖ్యమైన నామినేటెడ్ పదవులు ఉన్నాయి. వీటిని భర్తీ చేయకపోవడంతో గులాబీ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతోంది. నామినేటెడ్ పదవుల సంగతి పక్కనపెడితే కనీసం పార్టీ పదవులను భర్తీ చేయకపోవడం టీఆర్‌ఎస్ నేతలకు ఇబ్బందికరంగా
మారింది. టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి సైతం పార్టీలో తమ స్థానం ఏమిటనే విషయంలో గందరగోళం పెరుగుతోంది. టీఆర్‌ఎస్ జిల్లా కమిటీల సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 16న ముగిసింది.
వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా తక్కళ్లపల్లి రవీందర్‌రావు, గ్రేటర్ వరంగల్ కమిటీ అధ్యక్షుడిగా నన్నపనేని నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలను సంప్రదించి ఏప్రిల్ 20లోపే జిల్లా, గ్రేటర్ కమిటీల నియామకం పూర్తి చేయాలని ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన మంత్రి జి.జగదీశ్‌రెడ్డి.. కొత్త అధ్యక్షులకు సూచించారు. టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లా కమిటీలో 33 మంది చొప్పున ఉంటారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ముగ్గురు కార్యదర్శులు, ముగ్గురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు ప్రచార కార్యదర్శులు, ఒక కార్యాలయ కార్యదర్శి, ఒక కోశాధికారి, 17 మంది కార్యవర్గ సభ్యులు ఉంటారు. జిల్లా కమిటీలో, గ్రేటర్ వరంగల్ కమిటీలోనే ఇంతే సంఖ్యలో నాయకులకు చోటు కల్పిస్తారు. రెండు కమిటీలకు పార్టీ అనుబంధ సంఘాలు ఉంటాయి. ఇలా వందల మందికి జిల్లా కమిటీల్లో చోటు దక్కుతుంది. జిల్లా అధ్యక్షుల ఎన్నిక జరిగి మూడు నెలలు పూర్తయినా కమిటీలను నియమించలేదు. పార్టీ కమిటీల నియామకం ఎప్పుడు జరిగేది ఎవరికీ తెలియడంలేదు. దీంతో పార్టీ పదవులు ఆశిస్తున్నవారు నైరాశ్యంలో మునిగిపోయూరు. అధికారంలో ఉన్న పార్టీలకు ఇలా కమిటీలు లేని పరిస్థితి ఎప్పుడు లేదని గులాబీ నాయకులు చెప్పుకుంటున్నారు.
ఆత్మీయ భేటీలు లేవు...
నామినేటెడ్, పార్టీ పదవుల నియామకాలు లేక టీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీనికి తోడు సాధారణ ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా గెలిచిన కొందరి వైఖరి గులాబీ శ్రేణులకు ఇబ్బందికరంగా ఉంటోంది. పార్టీ కోసం పని చేసే వారికి అవకాశాలు ఇప్పించాల్సిన ముఖ్య నేతలు... తమ గురించి ఆలోచిండంలేదని ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు. పదవులు విషయం పక్కనబెడితే కొందరు ప్రజాప్రతినిధులు కనీసం కలిసేందుకు సమయం కేటాయించడంలేదని అంటున్నారు. ‘గతంలో అప్పుడప్పుడు జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగేది. పార్టీకి కమిటీలు లేకపోవడంతో ఇప్పుడు అదీ జరగడంలేదు. పార్టీలో ఎవరేమిటో ఏమీ అర్థంకావడలేదు’ అని టీఆర్‌ఎస్ వ్యవస్థాపక నాయకులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లోని పాత, కొత్త నేతల మధ్య సమన్వయం పెరిగేందుకు, అధికార పదవుల్లో ఉన్నవారు అందుబాటులోకి వచ్చేందుకు వీలుగా ప్రతి నెల జిల్లా స్థాయిలో ఆత్మీయ విందు కార్యక్రమం నిర్వహించాలని టీఆర్‌ఎస్ చట్టసభ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఆదేశించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మే 15న జిల్లాలోని ముఖ్యనాయకులకు చింతగట్టు గెస్ట్‌హౌజ్‌లో ఆత్మీయ విందు ఇచ్చారు. గత నెలలో మంత్రి చందూలాల్ ఈ కార్యక్రమం నిర్వహించారు. రెండు విందులతో ఈ కార్యక్రమం ఆగిపోయింది. జిల్లా పార్టీ సమావేశాలు లేక, ఆత్మీయ భేటీలు నిర్వహించకపోవడంతో ఒకరికి ఒకరు కలుసుకునే పరిస్థితి సైతం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో ఇలాంటి పరిస్థితి మంచిది కాదని వీరు అంటున్నారు.