'వాళ్లు నాయకుల్ని ఆకర్షిస్తే.. మేం ప్రజల్ని ఆకర్షిస్తాం'
నాగోలు(హైదరాబాద్): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ దూకుడుకు కళ్లెం వేస్తామని నల్లగొండ ఎంపీ, ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ మాయమాటలను నమ్మి నగర ప్రజలుమోసపోవద్దని పిలుపునిచ్చారు. మెట్రోరైలు, కష్ణాజలాలు, అనేక అభివద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు.
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్‌లతో కలిసి గుత్తా సోమవారం ఎల్‌బీనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ రాజ్యం నడుస్తోందని, గత ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కి పోటీ చేసే అభ్యర్థులే లేరని అధికారంలోకి రాగానే ఆకర్ష్ ఆపరేషన్ ద్వారా ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటోందని విమర్శించారు. 'టీఆర్ఎస్ నాయకులను ఆకర్షిస్తే మనం ప్రజలను ఆకర్షించి కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని వివరిద్దాం' అని కార్యకర్తలకు చెప్పినట్లు గుత్తా పేర్కొన్నారు.
బీజేపీగానీ, ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి చేసిన ఘనత ఏమీ లేదని ఎద్దేవాచేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తామని, ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని 11 స్థానాలను కాంగ్రెసే కైవసం చేసుకుంటుందన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతూ రిజర్వేషన్‌లను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.