gutta sukhender reddy
-
మాకు ఆ గౌరవం ఏదీ? ప్రొటోకాల్‌పై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తాము అత్యున్నత రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నా అధికారులు కనీసంప్రొటోకాల్ పాటించడం లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్న సందర్భాల్లో ప్రొటోకాల్ నిబంధనల మేరకు తమను గౌరవించడం లేదన్నారు. శాసనసభ ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతాధికారులతో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ అంశంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల జాబితాను వివరించారు. అనంతరం డీజీపీ జితేందర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతోనూ చైర్మన్, స్పీకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భేటీలో ప్రొటోకాల్ అంశంపై వీరిద్దరు ఉన్నతాధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు. తమను గౌరవించాల్సిన తీరుపై కిందిస్థాయి అధికారులకు అర్థమయ్యే రీతిలో సందేశాలు, సంకేతాలివ్వాలని గుత్తా, గడ్డం ప్రసాద్ చెప్పారు. చైర్మన్, స్పీకర్ అభ్యంతరాలు ఇవే.. తాము జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో కనీసం ఆర్డీఓ లేదా తహసీల్దార్ స్థాయి అధికారులు స్వయంగా వచ్చి స్వాగతం చెప్పాల్సిన ఉన్నా ఎవరూ రావడం లేదు. తమ పర్యటనలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ప్రొటోకాల్ విభాగం జిల్లా అధికారులకు పంపించడం లేదు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పరంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకూ ఆహ్వానించడం లేదు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రమే సమాచారం ఇస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో బదిలీలపై వచ్చే అధికారులు మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలవాలనే ఆనవాయితీని పాటించడం లేదు. దీంతో ఏ అధికారి ఏ స్థానంలో పనిచేస్తున్నారో కనీస సమాచారం కూడా ఉండట్లేదు. జాతీయ పండుగలైన పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ వేడుకలు తదితర సందర్భాల్లో తాము జాతీయ పతాకాన్ని ఏ జిల్లాలో ఎగురవేయాలో చివరి నిమిషం వరకు చెప్పడం లేదు. ⇒ పర్యటనలకు వెళ్లిన సందర్భంలో కనీసం ఎస్ఐ స్థాయి అధికారి బందోబస్తు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా కనిపించడం లేదు. దీనికి వాహనాల కొరత, మంత్రుల వెంట వెళ్లడం తదితర కారణాలను సాకుగా చూపుతున్నారు. ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో సినిమా తారలు, ఇతరులను కూర్చోబెడుతూ మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ వెళ్లిన సందర్భంలో అధికారిక ఏర్పాట్లేవీ చేయడం లేదు. అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు వెళ్లినపుడు భద్రతా ఏర్పాట్లు ఉండటం లేదు. 25 లేదా 26న రాష్ట్ర బడ్జెట్? రాష్ట్ర అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్ ఈనెల 23న ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర బడ్జెట్ ఈనెల 25 లేదా 26న ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సమీక్ష నిర్వహించారు. సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలపై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాసనసభ, మండలి లెజిస్లేచర్ సెక్రటేరియట్లో పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రొటోకాల్ వివాదాలు తలెత్తకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. ఈ సమీక్షలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహాచార్యులు, విప్ రామచంద్రు నాయక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు . -
బీఆర్ఎస్పై అసంతృప్తి లేదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధిష్టానంపై తాను అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవి వదంతులు మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీకి తాను గతంలో ఎంత దూరంలో ఉన్నానో ఇప్పుడు కూడా అంతే దూరం పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. శాసనమండలిలోని చైర్మన్ ఛాంబర్లో గుత్తా మంగళవారం మీడియాతో ఇష్టాగో ష్టిగా మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో సహా తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. తనకు మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉందని, ప్రత్యక్ష రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీ కేడర్‌ను కాపాడి పార్టీకి అండగా నిలబడేందుకు తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఎక్కడ అవకాశమిచ్చినా తన కుమారుడు పోటీ చేస్తాడని, అతనిది అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం అని పేర్కొన్నారు. తన కుమారుడికి పార్టీ టికెట్ అంశంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని గుత్తా వెల్లడించారు. నల్లగొండ, భువనగిరిలో బీసీలకు అవకాశ మిచ్చినా గెలుపు కోసం సహకరిస్తామన్నారు. నల్ల గొండ నుంచి సోనియా గాంధీ పోటీ చేసినా ఆమె పై పోటీకి తన కుమారుడు అమిత్ సిద్ధంగా ఉన్నా డని చెప్పారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వకున్నా పార్టీ మారే ప్రసక్తే లేదని గుత్తా స్పష్టం చేశారు. ఫిర్యాదులు ప్రివిలేజ్ కమిటీకి.. ముఖ్యమంత్రిపై సభ్యులు చేస్తున్న ఫిర్యాదులను ప్రివిలేజీ కమిటీకి పంపిస్తానని గుత్తా వెల్లడించారు. కేటీఆర్ తన నివాసానికి రావడం సాధారణ రాజకీ య ప్రక్రియలో భాగమని పేర్కొన్నారు. నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన సొంత జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వచ్చే శాసన మండలి సమావేశా లను పాత భవనంలో జరిపేందుకు ఏర్పాట్లు జరు గుతున్నాయన్నారు. కమ్యూనిస్టుల ఓట్ల శాతం తగ్గి నా ఎంతో కొంత బలం ఉందన్నారు. -
ఎమ్మెల్సీలను బ్రోకర్లని అంటారా!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిని ఇరానీ కేఫ్‌గా, ఎమ్మెల్సీలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరి స్తూ ఓ చానల్ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్య లు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై కఠినచర్యలు తీసుకో వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. సీఎం వ్యాఖ్యలు మొత్తం శాసనమండలి సభ్యులను అవమానపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. టీవీ చానల్ వేదికగా పెద్దల సభపై సీఎం మాట్లాడిన తీరు ఎథిక్స్ కమిటీ పరిశీలించాల్సిన రీతిలో ఉందని అభిప్రాయపడ్డారు. గౌరవ సభ్యులను బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి బ్రోకర్లు, ల్యాండ్ డీలర్లుగా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. శాసన మండలిలో అనేక మంది నిజాయితీ కలిగిన సభ్యులతో పాటు వివిధ రంగాల్లో సేవలకు తమ జీవితాలను అంకితం చేసిన వారు ఉన్నారని పేర్కొ న్నారు. సీఎం వాడిన భాషకు ఎంతో వేదనకు గుర య్యామని, ఎథిక్స్ కమిటీ పరిశీలనకు సీఎం వ్యా ఖ్యలను పంపి చర్యలు తీసుకోవాలని కోరారు. -
కేసీఆర్‌తో మండలి చైర్మన్ గుత్తా భేటీ
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం మాజీ సీఎం కేసీఆర్‌తో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డితో పాటు ఫామ్‌హౌస్‌కి వెళ్లిన సుఖేందర్‌రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్‌తో చర్చించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కూడా కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా మంగళవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే విజయుడికి కేసీఆర్ ఆశీస్సులు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును మంగళవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి కూడా ఉన్నారు. తొలుత మాజీ ఎమ్మెల్యే అబ్రహాంను అలంపూర్ అభ్యరి్థగా ప్రకటించి చివరి నిమిషంలో కేసీఆర్ విజయుడికి బీ ఫారాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ చల్లాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న విజయుడు చివరి నిమిషంలో టికెట్ దక్కించుకుని విజేతగా నిలిచారు. -
అసెంబ్లీ కమిటీలూ ముఖ్యమైనవే
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో చట్ట సభల తరహాలోనే శాసనసభ కమిటీలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల పనితీరును సమగ్రంగా పర్యవేక్షించడం కమిటీ ప్రధాన విధి అని స్పీకర్ పేర్కొన్నారు. బుధ వారం అసెంబ్లీ ఆవరణలో 2019–20 సంవత్సరపు ప్రభు త్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) తొలి సమావేశం కమిటీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థల పనితీరుకు సంబంధించిన నివేదికలు, లెక్కలను భారత కంపోŠట్రలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలను కమిటీ పరిశీ లిస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు, ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థికంగా పరిపుష్టం అయ్యేలా చూడాల్సిన బాధ్యత కమిటీపై ఉంటుందని శాసన మండ లి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, అకౌంట్స్ విషయంలో అకౌంటెంట్ జనరల్ ఇచ్చే నివేదికల్లో లోటుపాట్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని కమిటీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రకటించారు. సమావేశంలో సభ్యులు విద్యాసాగర్‌రావు, ప్రకాశ్‌గౌడ్, అబ్రహం, శంకర్‌నాయక్, దామోదర్‌రెడ్డి, భాస్కర్‌రావు, పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్, నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీష్ పాల్గొన్నారు. హామీల అమలు బాధ్యత ఆ కమిటీదే.. శాసన మండలి సభ్యులు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చే సందర్భంలో సీఎం, మంత్రులిచ్చే హామీలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత హామీల అమలు కమిటీపై ఉంటుందని మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో హామీల అమలు కమిటీ చైర్మన్ గంగాధర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన 2019–20 హామీల అమలు కమిటీ తొలి సమావేశంలో గుత్తా పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీగా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల కోటాలో శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలి సభ్యుడిగా ప్రమాణం చేశారు. సోమవారం మండలి ఆవరణలోని చైర్మన్ చాంబర్లో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డితోపాటు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, కిషోర్, మల్లయ్య యాదవ్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు హాజరయ్యారు. అనంతరం మండలి మీడియా పాయింట్ వద్ద భాస్కర్‌రావు, గొంగిడి సునీతతో కలసి గుత్తా విలేకరులతో మాట్లాడారు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రజాసేవ కోసం సద్వినియోగం చేస్తానని, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో నల్లగొండ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన మండలి ఎమ్మెల్యే కోటా ఉపఎన్నికలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన 2021 జూన్ 3వ తేదీ వరకు పదవిలో కొనసాగుతారు. -
కేసీఆర్, కేటీఆర్‌లకు గుత్తా ధన్యవాదాలు
సాక్షి, నల్గొండః ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు గుత్తా సుఖేందర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలమంతా పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వం అనుకున్న లక్ష్యం కన్నా అధికంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నేతృత్వంలో జరుగుతుందన్నారు. బీజేపీ.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనుకోవడం హాస్యాస్పదమని.. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచినంత మాత్రాన ఒరిగేది ఏమి లేదని.. ఆ తర్వాత అన్ని ఎన్నికలలో అడ్రెస్ లేకుండా పోయిందన్నారు. 7, 10వ తేదీల్లో నామినేషన్ వేస్తామన్నారు. -
గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతుసమన్వయ సమితి పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రభుత్వం శనివారం ఆమోదించింది. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు చేయడంతో రైతుసమన్వయ సమితి పదవిని వదులుకున్నారు. గుత్తా అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు కేసీఆర్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ ఎంపీగా కాంగ్రెస్‌నుంచి 2014 ఎన్నికల్లో విజయం సాధించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం లో టీఆర్ఎస్ గూటికి చేరారు. 2014 సార్వత్రిక ఎ న్నికల్లో, తెలంగాణ రాష్ట్రానికి జరిగిన తొలి ఎన్నికల్లో పదిహేడు ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించగా.. అందులో నల్లగొండ ఒకటి. టీఆర్ఎస్ గాలిని తట్టుకుని కాంగ్రెస్‌నుంచి విజయం సాధించిన ఆయన రాజకీయ పునరేకీకరణ పేర టీఆర్ఎస్ చేపట్టి ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా గులాబీ పార్టీకి చేరువయ్యారు. -
విత్తన ఎగుమతికి అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలకు నాణ్యమైన విత్తనాల ఎగుమతికి విస్తృత అవకాశాలున్నాయని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన విత్తనోత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్ వర్క్‌షాప్‌ను.. రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. విత్తన ఎగుమతులతో రాష్ట్ర రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని పోచారం వెల్లడించారు. సరిహద్దులతో సంబంధం లేకుండా విత్తన ఎగుమతులు, మార్కెటింగ్‌కు అన్ని దేశాలు అంగీకరించాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర కో ఆర్డినేటర్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అధిక విత్తనోత్పత్తికి అత్యంత అనుకూల వాతావరణం ఉందన్నారు. దక్షిణాసియా దేశాలకు ఎగుమతి చేసే చాన్స్: పార్థసారథి వివిధ దేశాల సాగు పరిస్థితులు, పంటల తీరును ఆకళింపు చేసుకుని విత్తనోత్పత్తి చేయాలని.. భారత్, ఆఫ్రికా, ఇతర దక్షిణాసియా దేశాల్లో ఒకే రకమైన పంటలు సాగులో ఉన్న విషయాన్ని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ప్రస్తావించారు. ఆయా దేశాల్లో తెలంగాణ విత్తనాలకు మంచి మార్కెట్ ఉందని, ప్రపంచ విత్తన వ్యాపారంలో భారత్ కేవలం 4.4 శాతం వాటాను మాత్రమే కలిగి ఉందన్నారు. ఈ వాటాను పది శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. గత రెండేళ్లలో ఓఈసీడీ ద్వారా విత్తన ధ్రువీకరణ పొంది, ఎగుమతులు చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఫిలిప్పీన్స్, సూడాన్, ఈజిప్ట్ దేశాలకు రాష్ట్రం నుంచి విత్తనాలు ఎగుమతి అవుతున్నాయన్నారు. దక్షిణాసియా దేశాలైన మయన్మార్, థాయ్‌లాండ్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక దేశా ల్లో సాగయ్యే పత్తి విత్తనాలు.. తెలంగాణ నుంచి ఎగుమతి చేసే వీలుందని పార్థసారథి తెలిపారు. ప్రపంచ విత్తన పరిశ్రమ వృద్ధిరేటు 7 శాతం కాగా, భారత్‌లో ఇది 17 శాతంగా ఉందని.. 2027 నాటికి జనాభా పెరుగుదలతో చైనాను భారత్ మించుతున్న నేపథ్యంలో ఆహార భద్రత కోసం విత్తనోత్పత్తి పెరగాల్సిన అవసరముందని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు, ఇస్టా అధ్యక్షుడు క్రెయిగ్ మాక్‌గిల్, ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రతినిధి చికెలు బా, ఆఫ్రికాలోని వివిధ దేశాల నుంచి 35 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు’
సాక్షి, నల్గొండ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో టీఆర్ఎస్ పాత్ర సూదిమొనంత కూడా లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. శుక్రవారం స్థానికంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించకుంటే ప్రత్యేక తెలంగాణ వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత టీపీసీసీ సీనియర్ నేతలు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించినవారేనని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రజలను మభ్యపెట్టేలా ఉందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని హామీలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో టీఆర్ఎస్ పాత్ర సూదిమొనంత -
రైతు భీమా పక్రియకు సహకరించాలి: గుత్తా
సాక్షి, నల్గొండ: రాష్ట్ర వ్యాప్తంగా రైతు భీమా పక్రియ విజయవంతంగా కొనసాగుతోందని టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 21 లక్షల మంది రైతులను కలిసి నామిని వివరాలు, సంతకాలు సేకరించామని చెప్పారు. జులై చివరి నాటికి భీమా పత్రాలను ఎల్ఐసీకి సమర్పించాలి.. కావునా రైతులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు అర్ధరహిత ఆరోపణలు మానుకొని రైతు భీమా పక్రియలో పాల్గొంటే రైతులకు మేలు చేసిన వారవుతారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంలో తీసుకొచ్చిన సంస్కరణలతో కేంద్రం కూడా రైతుల జపం చేస్తోందని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళన బాట పట్టారని, తెలంగాణలో అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. పిడుగుపాటుకు మరణించిన రైతులకు 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి కేసీఆర్ అంగీకరించారని తెలిపారు. -
రైతు కార్పొరేషన్ చైర్మన్‌గా గుత్తా
సాక్షి, హైదరాబాద్ : ఎవరిపైనా ఆధిపత్యం చెలాయించొద్దని రైతు సమితి సభ్యులకు సమితి కార్పొరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికారులతో కలసి పనిచేయాలని చెప్పారు. సోమవారం వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా గుత్తా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర అందేలా సమితి సభ్యులు కృషి చేయాలని చెప్పారు. సభ్యులకు జీతభత్యాలు లేవని, రైతులకు సేవ చేయాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రాష్ట్రంలో 5 వేల వరి నాటు యంత్రాలు ఇస్తామని వెల్లడించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో హరిత, నీలి, గులాబీ, క్షీర విప్లవాలు అమలవుతాయని, వీటి వల్ల 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపవుతుందని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని, పెట్టుబడి కింద ఆర్థిక సాయం అందించనున్నామని చెప్పారు. కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. ఈ పనంతా రైతు సమన్వయ సమితులు చేయనున్నాయని వివరించారు. -
రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం
చందంపేట (దేవరకొండ) : రైతాంగ శ్రేయస్సే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పోలేపల్లి, చందంపేట, గుంటిపల్లి, ముడుదండ్ల గ్రామాల పరిధిలోని చెరువుల వద్ద కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌తో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గుత్తా మాట్లాడుతూ 70 ఏళ్లుగా పూడికతో నిండిన కాల్వలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కాల్వల ద్వారా మండలంలోని ఆయా గ్రామాల్లోని చెరువులు జలకళను సంతరించుకోవడంతో రైతన్నలకు సాగు నీటికి డోకా లేదన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి డిండి రిజర్వాయర్ ద్వారా చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లోని సుమారు 12 చెరువులను నింపనున్నట్లు తెలిపారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయన్నారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ కాల్వల ద్వారా చెరువులకు నీరు చేరుతుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివెరుస్తోందని అన్నారు. అంతకుముందు ఎంపీ, ఎమ్మెల్యేలు చెరువుల వద్ద పూజలు చేశారు. కార్యక్రమంలో దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, వైస్ ఎంపీపీ వేణుధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, శ్రీనివాస్‌గౌడ్, డీఈ రూప్లానాయక్, శిరందాసు కష్ణయ్య, సర్పంచ్ అన్నెపాక ధనమ్మ, మల్లారెడ్డి, అనంతగిరి, మల్లేశ్‌యాదవ్ పాల్గొన్నారు. -
ఆ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దు
సాక్షి, నల్లగొండ: తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీజీవో గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీకి తేడా ఉంటుందన్నారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగు అయ్యే పరిస్థితుల్లో ...అందులోని బలమైన నాయకులను టీఆర్ఎస్లోకి తీసుకువడం ద్వారా సుస్థిరమైన ప్రభుత్వం నడపాలనే తీసుకునే నిర్ణయంలో ఇలాంటివి సహజమన్నారు. స్థానిక పరిస్థితులు, జిల్లా రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని కూడా ఇలాంటి నిర్ణయాలు ఉంటాయని గుత్తా వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ ఉద్యమకారులను తిట్టినోళ్లు, కొట్టినోళ్లు ఇప్పుడు ముఖ్యమంత్రి వద్ద ఉన్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అనంతరం ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని తాను అన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. మరోవైపు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా రెండురోజుల క్రితం ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. నాడు కేసీఆర్‌ను బండబూతులు తిట్టిన వారే నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, రాష్ట్ర కేబినెట్లో మంత్రులుగా కొనసాగుతున్నారని తనదైన శైలిలో విరుచుకుపడిన విషయం విదితమే. అయితే తెలంగాణలో టీడీపీని కూకటివేళ్లతో పెకలించేందుకే ఆ పార్టీ నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నామని అన్నారు. -
'మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం'
సాక్షి, నల్గొండ: పార్టీ మారుతున్నానని మీడియాలో వస్తున్న వార్తలను ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఖండించారు. తాను పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఎప్పుడూ పాటు పడతానన్నారు. మెడికల్ కాలేజ్, బత్తాయి మార్కెట్ కోసం సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించానని వివరించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వచ్చిన మెజార్టీ పదివేలు మాత్రమేనని, ఆయనకు వచ్చిన ఓట్లు 60 వేలు అయితే సీఎంపై లక్ష ఓట్లతో మెజార్టీ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కోమటిరెడ్డి అబద్ధాల పుట్ట అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డికి ప్రజలు బుద్ది చెబుతారన్నారు. ఇప్పటికైనా ప్రగల్భాలు మానుకోవాలని కోమటిరెడ్డికి గుత్తా సూచించారు. కాగా టీడీపీ నేత కంచర్ల భూపాల్‌రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకోవడంపై గుత్తా సుఖేందర్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. కంచర్ల సోదరులు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందుగానే కంచర్ల సోదరులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే కంచర్ల సోదరులకు పార్టీలో గౌరవం కల్పిస్తామని కేసీఆర్ హమీ ఇచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ హమీ మేరకే కంచర్ల భూపాల్‌రెడ్డికి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ పదవిని కట్టబెట్టారు. అంతేకాదు ఇప్పటివరకు ఇంఛార్జీగా ఉన్న దుబ్బాక నర్సింహ్మరెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. ఈ పరిణామంతో సుఖేందర్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది. -
‘ఆయనవి కోతి చేష్టలు...నమ్మొద్దు’
సాక్షి, నల్లగొండ: పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. నల్లగొండలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాజకీయ ఉనికి కోసమే ఛలో అసెంబ్లీ పేరుతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో పత్తికి కొంత నష్టo వాటిల్లిన మాట వాస్తవమన్నారు. అందుకే పత్తి రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అయితే, ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలు చులకన అవుతున్నాయని అన్నారు. ఛలో అసెంబ్లీ ఎందుకో కోమటిరెడ్డికే తెలియాలని వ్యాఖ్యానించారు. జిల్లాలో 59 ఐకేపీ సెంటర్లు, 18 పత్తి కొనుగోళ్లు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి వస్తే తన ఉనికి తగ్గిపోతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భయపడుతున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్‌ను బీట్ చేయడానికి, రాజకీయ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి చలో అసెంబ్లీ అని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వ్యవసాయం అంటే తెలియని కోమటిరెడ్డి రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారన్నారు. ఆయన కోతి చేష్టలను రైతులు నమ్మొద్దని కోరారు. కాగా పత్తి రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 27న తలపెట్టిన ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి రావాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు’ తప్పా అనే స్ఫూర్తితో రైతుల తరఫున తానే ముందుండి పోరాడుతానని కోమిటిరెడ్డి నిన్న తెలిపారు. భవిష్యత్‌లో ఎంపీ, ఎమ్మెల్యే ఏదీ కాకున్నా రైతుల కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. -
కోమటిరెడ్డివి చిల్లర రాజకీయాలు
నల్లగొండ: బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మతి భ్రమించి చిల్లర రాజకీయాలు చేశారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమిర్శించారు. కోమటిరెడ్డిని పరామర్శిస్తామంటున్న జానారెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. గతంలో జానారెడ్డి, ఉత్తమ్‌లను ఎన్నో సార్లు కోమటిరెడ్డి అవమానించాడని గుర్తు చేశారు. కోమటిరెడ్డి హుందాగా ప్రవర్తించాలని, లేకుంటే పరాభవాలు తప్పవని హెచ్చరించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కోమటిరెడ్డి రాజకీయంగా పరిణతి సాధించలేదని విమర్శించారు -
రణరంగం
⇔ పోటాపోటీ నినాదాలతో రాళ్లు రువ్వుకున్న శ్రేణులు ⇔ పగిలిన తలలు, చిరిగిన చొక్కాలు.. కార్లు, బైక్‌లు ధ్వంసం ⇔ యుద్ధభూమిని తలపించిన ఎస్సెల్బీసీ ప్రాంగణం ⇔ కోమటిరెడ్డిని బలవంతంగా బయటకు పంపించిన పోలీసులు ⇔ వైఎస్ విగ్రహం వద్ద వెంకట్‌రెడ్డి ధర్నా.. ‘మిర్యాల’కు తరలింపు ⇔ బత్తాయి మార్కెట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రులు ⇔ హరీశ్ రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ సుఖేందర్‌రెడ్డి సాక్షి, నల్లగొండ : సాయంత్రం 4 గంటలు.. నల్లగొండ నుంచి సాగర్ వెళ్లే రహదారిలో గంధంవారి గూడెం గ్రామ సమీపంలోని ఎస్సెల్బీసీ ప్రాంగణం వద్ద సందడి నెలకొంది. బత్తాయి మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రులు వస్తుండడంతో టెంట్లు,మైకులతో ఆ ప్రాంతమంతా హడావుడిగా ఉంది. తెలంగాణ పాటలు, ఉపన్యాసాలతో అక్కడ ఉత్సాహకర వాతావరణం కనిపిస్తుండగానే ఉన్నట్టుండి గాల్లోకి రాళ్లు లేచాయి. ఏంటీ... రాళ్ల వాన ఏమైనా కురుస్తుందా అని ఆలోచించేలోపే ఆ వాన యుద్ధంగా మారింది. పెద్ద పెద్ద రాళ్లు, గుండ్లు గాలిలో రయ్యిమని వచ్చి తలలు పగులగొట్టాయి. అవే రాళ్లు కార్ల అద్దాలు, బైక్‌లను ధ్వంసం చేశాయి. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసినంత తేలికగా రాళ్లు విసురుకోవడంతో ఆ ప్రదేశం అరగంటకు పైగా యుద్ధభూమిగా మారింది. కర్రలు ఓ చేత్తో, రాళ్లు మరో చేత్తో పట్టుకుని ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. నల్లగొండలో మంగళవారం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య రాజకీయ రణరంగమే జరిగింది. అసలేం జరిగిందంటే.. జిల్లా రైతుల చిరకాల కోరిక అయిన బత్తాయి మార్కెట్ శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రానుండడంతో టీఆర్ఎస్ నేతలు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావుకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించారు. తొలుత మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో మర్రిగూడ బైపాస్ నుంచి కోమటిరెడ్డి బైక్‌ర్యాలీతో క్లాక్‌టవర్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడే కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన కోమటిరెడ్డి ర్యాలీగా బత్తాయి మార్కెట్ శంకుస్థాపన చేసే ప్రదేశం వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కోమటిరెడ్డిని చూసి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా తాను కూడా కార్యక్రమంలో పాల్గొంటానని కోమటిరెడ్డి తన అనుచరులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసిన టెంటు కింద కూర్చున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రులు వచ్చే సమయం సమీపిస్తుండడం, టీఆర్ఎస్ కార్యకర్తలు బైక్‌ర్యాలీతో పట్టణం నుంచి శంకుస్థాపన ప్రాంగణానికి వస్తుండడంతో పరిస్థితి చేయి దాటుతోందని గమనించిన పోలీసులు కోమటిరెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు. వెంకట్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు కూడా వెళ్లిపోతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించే ప్రయత్నం చేశారు. గమనించిన టీఆర్ఎస్ కార్యకర్తలు వారిపై దాడి చేసేందుకు పరుగులు తీశారు. దీంతో రాళ్లు గాల్లోకి లేచాయి. అటునుంచి రాళ్లు రావడంతో సభాప్రాంగణంలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడ ఉన్న రాళ్లను కి విసిరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణుల వైపు నుంచి కూడా రాళ్లు వచ్చాయి. దీంతో పదుల సంఖ్యలో తలలు పగిలాయి. ఇరు పార్టీల కార్యకర్తలు తమకు దొరికిన కార్లు, బైక్‌లను ధ్వంసం చేశారు. ఇలా అరగంటకు పైగా సాగర్ రోడ్డు యుద్ధక్షేత్రాన్ని తలపించింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత మాటల యుద్ధం రాళ్ల యుద్ధం ముగిసి కోమటిరెడ్డి అరెస్ట్.. ఆ తర్వాత బత్తాయి మార్కెట్ శంకుస్థాపన.. అనంతరం కూడా ఇరుపార్టీల నేతలు మాటల యుద్ధం చేసుకున్నారు. తన అరెస్ట్ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిలాల్లో టీఆర్ఎస్ నేతలందరూ నయీం అనుచరులేనని, రౌడీల్లా మారి జిల్లాలో అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక, బత్తాయి మార్కెట్ బహిరంగసభలో మాట్లాడిన ఎంపీ సుఖేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్, జగదీశ్ కూడా కోమటిరెడ్డిపై విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డిని ఎంపీ సుఖేందర్‌రెడ్డి కల్లుతాగిన కోతితో పోల్చారు. ప్రతిపక్షాలు పాటించాల్సిన సంప్రదాయాలు ఎమ్మెల్యే కోమటిరెడ్డికి తెలియవని, చీప్ పాపులారిటీ కోసం ఆయన పాకులాడుతున్నాడని విమర్శించారు. హీరో అనిపించుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో వ్యవహరించిన కోమటిరెడ్డికి టీఆర్ఎస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ఆగమాగం ఎందుకు చేసిండు.. : మంత్రి హరీశ్‌రావు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మంచి జరగడం ఇష్టం లేకనే, మంచి పేరు తమకు వస్తుందనే దుగ్ధతోనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఇలా వ్యవహరించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘మీ ఎమ్మెల్యేకు ఎందుకంత తొందరో అర్థమైతలేదు. మేమేమీ ఏసీలో కూర్చోలేదు కదా.. 15 ఏళ్ల నుంచి బత్తాయి మార్కెట్ అడుగుతున్నా కాంగ్రెసోళ్లు చేయలేదు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డి మంత్రులుగా ఉన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు మేం చేస్తుంటే కుండీలు ఎత్తేసుడు.. ఫ్లెక్సీలు చించుడు.. ఎందుకింత ఆగమాగం చేసిండో అర్థం కావడం లేదు. రసాభాస చేస్తే పేరు రాకుండా పోతుందనే ఉద్దేశంతోనే.’ అని ఆయన వ్యాఖ్యానించారు. మేం కరవలేదు.. బుస మాత్రమే కొట్టాం : మంత్రి జగదీశ్ బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా జరిగిన గొడవపై మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డిని కోతి అనడానికి కూ డా లేదని, అంతకన్నా దరిద్రం గా ఆయన తయారయ్యాడని అ న్నారు. మీడియాలో కనిపిం చాల నే ఆలోచనతో చిల్లర వేషాలు వేస్తున్నాడని అన్నారు. అరాచకా లు, చిల్లర వ్యవహారాలను జిల్లాలో సాగనీయబోమని, అలా చే యాలని చూస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించా రు. ‘ఇవి ఇంక మీ జాగీర్లు కావు. తెలంగాణ ప్రజల అడ్డాలు. మేం పూర్తిగా కరవలేదు. కేవలం బుస మాత్రమే కొట్టాం.’ అని వ్యాఖ్యానించారు. మళ్లీ ధర్నా తనను శంకుస్థాపన ప్రదేశం నుంచి బలవంతంగా పోలీసులు పంపించివేయడాన్ని, తమ కార్యకర్తలపై జరిగిన దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి దేవరకొండ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా ప్రవరిస్తున్నారని, వారి అరాచకాలకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని ఆయన హెచ్చరించారు. ఇంతలో ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి అక్కడకు చేరుకుని కోమటిరెడ్డిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీసులు ఆయనను మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే, కోమటిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయం వద్ద కూడా ధర్నా నిర్వహించాయి. కోమటిరెడ్డిని అరెస్టు చేస్తున్న సందర్భంగా నల్లగొండలో కాంగ్రెస్ శ్రేణులు ప్రతిఘటించడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. కోమటిరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి మార్కెట్ వద్దకు చేరుకుని శంకుస్థాపన చేశారు. -
'తెలంగాణ రైతులకు ఏపీ ఇబ్బందులు'
నల్లగొండ: పులించితల ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెడితే ఎవరికి మంచిది కాదన్నారు. నిబంధనల ప్రకారం పులిచింతలలో 4 టీఎంసీలను నిల్వ చేసి లిఫ్ట్‌ల కింద ఉన్న ఆయకట్టుకు నిర్భందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్లో ఈ సారి నల్లగొండకు రైల్వే కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నామన్నారు. ప్రతిసారి జిల్లాకు అన్యాయం జరుగుతోందని ఈ సారైన బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. -
అది కేసీఆర్ సొంత ఇల్లు కాదు: గుత్తా
నల్లగొండ: పాత పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బడాబాబుల చర్యలు తీసుకుని నల్లధనం వెలికితీస్తే ప్రధాని నరేంద్ర మోదీకి క్రెడిట్ దక్కేదని చెప్పారు. తాను రాసిన లేఖ వల్లే కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లు రద్దు చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారని, ఆ లేఖలో ప్రత్యామ్నాయాలు కూడా రాసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం కొత్త క్యాంపు కార్యాలయంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. క్యాంపు ఆఫీసు కేసీఆర్ సొంతిల్లు కాదని, ప్రభుత్వ భవనమని స్పష్టం చేశారు. కాగా, హైదరాబాద్ లోని బేగంపేటలో కొత్తగా నిర్మించిన అధికార నివాస భవన సముదాయంలోకి గురువారం తెల్లవారుజామున 05.22 నిమిషాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు గృహప్రవేశం చేశారు. -
జిల్లాను హరితవనంగా మార్చాలి
పెద్దఅడిశర్లపల్లి : హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని జిల్లాను హరితవనంగా మార్చాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పీఏపల్లి మండలం గుడిపల్లి, కేశంనేనిపల్లి గ్రామాల్లో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారని పేర్కొన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ మనం నాటిన మొక్కలు ముందు తరాలకు ఉపయోగపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధర్మయ్య, ఎంపీడీఓ జావెద్అలీ, జెడ్పీటీసీ తేరా స్పందనరెడ్డి, మాజీ జెడ్పీటీసీ తేరా గోవర్ధన్‌రెడ్డి, గుడిపల్లి సర్పంచ్ శీలం శేఖర్‌రెడ్డి, గుడిపల్లి ఎంపీటీసీ వడ్లపల్లి చంద్రారెడ్డి, కేశంనేనిపల్లి సర్పంచ్ రవికుమార్, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ వెంకట్‌రెడ్డి, నాయకులు మారం కృష్ణమూర్తి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
త్వరలో ‘డిండి’ ప్రాజెక్టు నిర్మాణ పనులకు టెండర్లు
కొండమల్లేపల్లి : త్వరలో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులకు టెండర్లు వేయనున్నట్లు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం కొండమల్లేపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు సస్యశ్యామలవుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని, ప్రధానంగా జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంపొందించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు ప్రాధాన్యతనిచ్చి మొదటగా హరితహారం కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలో ప్రారంభించారన్నారు. పిల్లలను ఏవిధంగా చూసుకుంటామో నాటిన ప్రతి మొక్కను అదేవిధంగా చూసుకోవాలని సూచించారు. అనంతరం దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో దేవరకొండ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్‌రెడ్డి, మాడ్గుల యాదగిరి, వస్కుల కాశయ్య, పస్నూరి వెంకటేశ్వర్‌రెడ్డి, అల్గుల సైదిరెడ్డి, నాగవరం రాజు, తేరా గోవర్ధన్‌రెడ్డి, శిరందాసు కృష్ణయ్య, అబ్బనబోయిన శ్రీనివాస్‌యాదవ్, దస్రూనాయక్, వెంకటయ్య, ఆప్కో సత్తయ్య తదితరులున్నారు. -
హరితహారంలో భాగస్వాములు కావాలి
కొండమల్లేపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో దేవరకొండ మండలం చింతకుంట్లలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్‌రెడ్డి, సర్పంచ్ శవ్వ యాదమ్మవెంకటయ్య, వైస్ చైర్మన్ నల్లగాసు జాన్‌యాదవ్, ఎక్సైజ్ సీఐ జిలానీ, ఎస్ఐ పరమేశ్వర్‌గౌడ్, నాయకులు శిరందాసు కృష్ణయ్య, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, పస్నూరి వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. -
బాబు కప్పుతున్న కండువాలు కనిపించ లేదా ?
నల్గొండ : టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన రేవంత్ రెడ్డి విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులపై మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కండువాలు కప్పుతున్నది కనిపించడం లేదా అని రేవంత్‌ను గుత్తా సూటిగా ప్రశ్నించారు. నేను గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగితే...పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారని గుర్తు చేశారు. నన్ను విమర్శించే స్థాయి ఉత్తమ్‌కుమార్‌కు లేదని గుత్తా స్పష్టం చేశారు. -
‘గుత్తా’ రాజీనామా చేయాలి
చౌటుప్పల్ : రంగులు మార్చే ఊసరవెల్లిలా పార్టీలు మారుస్తూ, ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీతో వచ్చిన ఎంపీ పదవికీ రాజీనామా చేయాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి వెళ్తూ, చౌటుప్పల్‌లో ఆగారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అయ్యప్ప దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ మండల పార్టీ కార్యాలయంలో పలువురు యువకులు టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. గుత్తా రాజీనామా చేసే దాకా టీవీల్లో పార్టీ ఫిరాయింపులు, అవినీతి గురించి నీతులు మాట్లాడొద్దన్నారు. గుత్తాతో పాటు ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్ తమ పదవులకు రాజీనామా చేసే దాకా వారిని సాంఘిక బహిష్కరణ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం రీ-డిజైనింగ్‌ల పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే టెండర్లు పిలుస్తుందన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి సందీప్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నగోని అంజయ్యగౌడ్, జక్కలి అయిలయ్య, మండల పార్టీ అధ్యక్షుడు హన్నూభాయ్, గంగాపురం గంగాధర్, కొసన ం భాస్కర్‌రెడ్డి, నల్ల గణేశ్, ఎరుకల మల్లేశంగౌడ్, గ్యార కిష్టయ్య, కాటేపల్లి శేఖర్, ఎంఎన్గౌడ్, మల్లారెడ్డి, పర్వతాలు, చలమందరాజు, అంజిరెడ్డి, రవి, మహేశ్ పాల్గొన్నారు.