
'సీఎం కావాలని కీలక నేతలు కలలు కన్నారు'
హైదరాబాద్: కొందరు కీలక నేతలు సీఎం కావాలని కలలు కన్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు సీఎం కావాలని కలలు కన్నా.. పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ కలల్ని పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చురకలంటించారు. పొన్నాల సెగ్మెంట్ లో పలువురు నేతలు టీఆర్ఎస్ లోకి వలస వెళ్లారన్న సంగతిని గుత్తా గుర్తు చేశాడు. నల్గొండ జిల్లాలోని చాలా సెగ్మెంట్లలో పార్టీ సభ్యత్వం మందకొడిగా సాగుతుందని గుత్తా అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా కీలక నేతలు ఐక్యంగా లేరన్న వార్తలను కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి ఖండించారు. ఆ వార్తలు అపోహలు మాత్రమేనన్నారు. ఇకపై కీలక నేతలమంతా ఒక వేదికపైకి వచ్చి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కాగా, కొన్ని పొరపాట్ల వల్ల కాంగ్రెస్ ఓడిందన్న సంగతి అందరికీ తెలుసని మరో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీ బలోపేతంపై కీలక నేతలమంతా ఐక్యంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.