కాంగ్రెస్ హయాంలో సాగు, తాగునీటి రంగాల్లో జరిగిన అభివృద్ధిని కించపరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు.
నల్లగొండ జిల్లా: కాంగ్రెస్ హయాంలో సాగు, తాగునీటి రంగాల్లో జరిగిన అభివృద్ధిని కించపరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలో గురువారం మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నీ ఇంటికి వస్తున్నవి కృష్ణా నీళ్లు కావా? అవి కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా వచ్చినవే కదా..?’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అసభ్య పదజాలంతో కాంగ్రెస్ నాయకులను దూషించడం సరికాదన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో తాను, మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి పోరాడుతున్న సమయంలో కేసీఆర్ పార్లమెంట్ హాలు దర్వాజ దగ్గరకు వచ్చి తొంగిచూసిన వెళ్లిన సంగతి మరిచిపోవద్దన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఏదోరకంగా ఆమోదం పొందేవిధంగా చూడాలని చెప్పినప్పుడు తాము మీకు సహకరించలేదా అని ప్రశ్నించారు. అప్పుడు తాము చవట దద్దమ్మల్లాగా కనపించని మీకు.. ఇప్పుడు ఎలా కనిపిస్తున్నామని పేర్కొన్నారు.