తాగునీటికి చింత ఉండదు..
సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా మీదుగా జీవనది కృష్ణానది పారుతున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకక గొంతెండిపోతుంది. మంచినీళ్ల కోసం పల్లె నుంచి పట్నం దాకా అందరిదీ ఒకటే బాధ. కాసిన్ని నీళ్ల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిందే. ఇక ఎండాకాలమైతే ప్రజల బాధలు వర్ణనాతీతం. ఎక్కడ చూసినా కన్నీటి బాధలే. బిందెలు తీసుకొని కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయిం చింది.
జిల్లా మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చి ప్రతి కుటుంబానికి నీళ్లు అందించాలని భావిస్తోంది. జిల్లా మొత్తానికి గ్రిడ్ ఏర్పాటు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. తాగునీటి గ్రిడ్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని 15రోజుల్లోగా నివేదిక అందజేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆలోచన త్వరతగతిన అమలైతే వచ్చే వేసవి కాలంలో పాలమూరువాసులకు కన్నీటి కష్టాలు తప్పనున్నాయి.
మూడువేల గ్రామాలకు సరైన నీటి సదుపాయం లేదు..
గుక్కెడు తాగునీటి కోసం పడుతున్న కష్టాలు అ న్ని ఇన్నీ కావు. వర్షాకాలం అయినా ప్రస్తుతం చాలా పట్టణాలు, గ్రామాల్లోని కుటుంబాలు గొంతు తడవడంలేదు. మంచినీళ్ల కోసం ధీనం గా అర్థిస్తున్నారు. స్వయంగా జిల్లా కేంద్రం అయిన మహబూబ్‌నగర్ పట్టణంలో పదిహేను రోజుల కొకసారి నీళ్లు వస్తున్నా యి. జిల్లా కేంద్రం పరి స్థితి ఇలా ఉంటే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏం టనేది ఇట్టే అర్థమవుతోం ది. జిల్లాలో1,313 గ్రామ పంచాయతీల పరిధిలో 3,417 ఆవాసాలున్నాయి.
వీటిలో 483 ఆవాసాలకు మా త్రమే మల్టీ విలేజ్ స్కీం ద్వారా తాగునీరు అందిస్తున్నారు. దాదాపు మూడు వేల ఆవాసాలకు సరైన నీటి సదుపాయం లేదు. చాలా గ్రామాలు, పట్టణాలు కేవలం బోరుమోటర్లను ఆధారం చేసుకొనే దాహార్తి తీర్చుకుంటున్నాయి. ప్రధాన పట్టణాలైన మహబూబ్‌నగర్, వనపర్తిలతో పాటు 483 గ్రామాలకు మాత్రం రామన్‌పాడు, కోయిల్‌సాగర్ జలాశయాల నుంచి తాగునీరు అందిస్తున్నారు. ఈ రెండు మార్గాల గుండా ఉన్న పైపులైన్లు నాసిరకం కావడంతో తరచూ పగిలిపోతున్నాయి. దీంతో దినదిన గండంగా నీటి సరఫరా జరుగుతోంది.
సమస్య తీరాలంటే 5టీఎంసీల నీరు అవసరం
జిల్లా ప్రజలందరికీ తాగునీరందించాలంటే 5టీఎంసీల నీళ్లు అవసరమవుతాయని ఉన్నతాధికారులు అంచనా వేశారు. వీటి నిల్వ, పంపింగ్ విధానం, పైప్‌లైన్ మార్గాలు తదితర వాటిపై అధికారులు బ్లూఫ్రింట్ సిద్ధం చేస్తున్నారు. జిల్లా మొత్తానికి తాగునీటి చింత తీర్చేందుకు ప్రభుత్వ ఆలోచన మేరకు ఒక గ్రిడ్ ఏర్పాటుకు చర్యలు ముమ్మరమయ్యాయి. జిల్లాలో ఏర్పాటు చేయబోయే గ్రిడ్‌ను కృష్ణానది ఆధారం చేసుకొని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిద్వారా ఇప్పటికే తాగునీరు అందిస్తోన్న రామన్‌పాడు, కోయిల్‌సాగర్‌లను అనుసంధానం చేయనున్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న మరో 35 తాగునీటి పథకాలను కూడా గ్రిడ్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
పక్కగా అమలు...
జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటి దాదాపు 350 కి.మీ మేర ప్రధాన పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక డివిజన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ భారీ సంపులను నిర్మించనున్నారు. అక్కడ నీటిని శుద్ధి చేసి డివిజన్ పరిధిలోని అన్ని పట్టణాలు, గ్రామాలు, ఆవాసాలకు నీరు అందేలా పక్కగా ప్రణాళికలు రూపొందించారు. గ్రిడ్ విధానాన్ని త్వరతగతిన పనులు ప్రారంభమయ్యేందుకు, అందుకు సరిపడా నిధులను కూడా వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.