నల్లగొండ: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విధానాలు రోజు రోజుకీ పెచ్చుమీరుతున్నాయని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీఎం తుంగలో తొక్కి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆదివారం నల్లగొండలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు తీర్పు వెలువడి పదిహేను రోజులు కావస్తున్నా పార్లమెంటరీ కార్యదర్శులను కొనసాగించడం చట్టాన్ని అగౌరవ పర్చడమేనన్నారు. కేసీఆర్ రాక్షస మనస్తత్వంతో రాచరిక పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేపట్టిన రైతు భరోసా యాత్రను విమర్శించే నైతిక హక్కు టీఆర్‌ఎస్ పార్టీకి లేదన్నారు. టీడీపీలో మంత్రి పదవులు వెలగబెట్టిన పోచారం, తుమ్మల లాంటి వారు... కాంగ్రెస్ హాయాంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు వంటి వారికి రాహుల్ యాత్రను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. సోనియా, రాహుల్ గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? అని ప్రశ్నించారు.