
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతుసమన్వయ సమితి పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రభుత్వం శనివారం ఆమోదించింది. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు చేయడంతో రైతుసమన్వయ సమితి పదవిని వదులుకున్నారు. గుత్తా అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు కేసీఆర్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నల్లగొండ ఎంపీగా కాంగ్రెస్‌నుంచి 2014 ఎన్నికల్లో విజయం సాధించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం లో టీఆర్‌ఎస్ గూటికి చేరారు. 2014 సార్వత్రిక ఎ న్నికల్లో, తెలంగాణ రాష్ట్రానికి జరిగిన తొలి ఎన్నికల్లో పదిహేడు ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించగా.. అందులో నల్లగొండ ఒకటి. టీఆర్‌ఎస్ గాలిని తట్టుకుని కాంగ్రెస్‌నుంచి విజయం సాధించిన ఆయన రాజకీయ పునరేకీకరణ పేర టీఆర్‌ఎస్ చేపట్టి ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా గులాబీ పార్టీకి చేరువయ్యారు.