కరీంనగర్‌లో ఎన్నికల ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: నేడు ఎన్నికలు జరుగుతున్న ఆరు స్థానాల్లోనూ గెలుపొందేలా సుమారు వారం రోజులుగా టీఆర్‌ఎస్ ఓటర్లతో క్యాంపులు ఏర్పాటు చేసింది. బెంగళూరు, మైసూరు, ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, కాశ్మీర్, గోవా తదితర ప్రాంతాల్లో సుమారు వారం రోజులుగా పర్యటించిన కరీంనగర్, మెదక్, ఖమ్మం ఓటర్లు బుధ, గురువారాల్లో బృందాల వారీగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. నల్లగొండ, ఆదిలాబాద్ ఓటర్లు భద్రాచలం, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించుకుని బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
వీరి కోసం జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్ నగర శివార్లలోని శంషాబాద్, శంకర్‌పల్లి, శామీర్‌పేట, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లు, రిస్టార్టుల్లో బస ఏర్పాటు చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు సంబంధిత జిల్లాల మంత్రులు హరీశ్‌రావు (మెదక్), గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ (కరీంనగర్), పువ్వాడ అజయ్ (ఖమ్మం), ఇంద్రకరణ్‌రెడ్డి (ఆదిలాబాద్), జగదీశ్‌రెడ్డి(నల్లగొండ)తో పాటు సంబంధిత నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు శిబిరాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. శిబిరాల్లో ఉన్న ఓటర్లకు డమ్మీ బ్యాలెట్ ద్వారా ఓటింగ్‌పై అవగాహన కల్పిం చారు. శుక్రవారం ఉదయం ఓటర్లను ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు.
మద్దతుదారులతో కాంగ్రెస్ శిబిరాలు
మెదక్, ఖమ్మం స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించిన కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీ ఓటర్లు చేజారకుండా చివరి నిమిషంలో క్యాంపులకు తరలించింది. మెదక్‌లోఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల పోటీలో ఉండటంతో కాంగ్రెస్ మద్దతుదారులను బుధవారం రాత్రి హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టుకు తరలించినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ శిబిరంలో ఉన్న సుమారు 50 మంది ఓటర్లు తమతో టచ్‌లో ఉన్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
ఖమ్మం అభ్యర్థి రాయల నాగేశ్వరరావు తనకు మద్దతుగా నిలుస్తారనుకున్న వారిని క్యాంపునకు తీసుకెళ్లినట్లు తెలిసింది. కరీంనగర్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా తమ పార్టీ అభ్యర్థి పోటీలో లేకున్నప్పటికీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లతో శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. తన అనుచరులు టీఆర్‌ఎస్ లేదా ఇతరుల ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకే శ్రీధర్‌బాబు ఈ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
గ్లౌజ్‌లు, శానిటైజర్ తప్పనిసరి: సీఈఓ
ఓటర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్‌లో పాల్గొనాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ విజ్ఞప్తి చేశారు. సిబ్బందితో పాటు ఓటర్లు గ్లౌజ్‌లు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని గురువారం మీడియా సమావేశంలో సూచించారు. పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్‌రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని, అభ్యర్థులు తమ ప్రతినిధులను కూడా స్ట్రాంగ్ రూమ్ వద్ద కాపలా పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలి పారు. 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment