తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు : గెలిచాక సరే..ఇప్పుడు నా సంగతి చూడు..! | Telangana Mlc Election Campaign | Sakshi
Sakshi News home page

ఇంతకీ మాకేంటి...?

Published Fri, Dec 10 2021 3:11 AM | Last Updated on Fri, Dec 10 2021 3:14 AM

Telangana Mlc Election Campaign - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికలు జరిగే ఆరు స్థానాల్లో సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కు మెజారిటీ ఓటర్లు ఉన్నా వారు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 స్థానాలుంటే ఆరు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఆరు స్థానాల్లో కాంగ్రెస్, స్వతంత్రులు పోటీలో ఉండటంతో అన్ని స్థానాలు గెలవడాన్ని టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మెదక్, ఖమ్మంలో కాంగ్రెస్‌కు ఓట్ల పరంగా పెద్దగా బలం లేనప్పటికీ టీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీలకు చెందిన ఓటర్లు క్రాస్‌ ఓటింగ్‌ చేస్తారనే నమ్మకంతో అభ్యర్థులను బరిలోకి దింపింది. 

టీఆర్‌ఎస్‌ ప్రారంభం నుంచి పార్టీలో పనిచేస్తున్న మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తుండటం, కరీంనగర్‌ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉండ టంతో టీఆర్‌ఎస్‌ అప్రమత్తమైంది. ఈ 3 జిల్లాల పరిధిలోని నాలుగు స్థానాల్లో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పార్టీ ఓటర్లను టీఆర్‌ఎస్‌ ఇతర రాష్ట్రాల్లోని క్యాంపులకు తరలించింది. ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థితో పాటు మరో 22 మంది పోటీలో ఉండగా, 21 మంది తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించు కున్నారు. పార్టీ అభ్యర్థితో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా పోటీలో ఉండటంతో టీఆర్‌ఎస్‌ శిబిరం తొలుత కొంత ఆందోళన చెందినా.. తర్వాత పరిస్థితిని తమ అధీనంలోకి తెచ్చుకుంది. నల్లగొండలోనూ ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నా, బలమైన అభ్యర్థులు లేకపోవడం తమకు కలిసి వస్తుందని టీఆర్‌ఎస్‌ లెక్కలు వేసుకుంటోంది.

విందు, వినోదాలు.. ప్రలోభాల ఎర..
ఓటర్లు చేజారకుండా ఉండేందుకు టీఆర్‌ఎస్‌తో పాటు వ్యతిరేక శిబిరం కూడా తమ మద్దతుదారులతో క్యాంపులు ఏర్పాటు చేసింది. పర్యాటక ప్రాంతాల సందర్శన, ఖరీదైన హోటళ్లలో బస, విమాన ప్రయాణాలు, విందు, వినోదాలతో క్యాంపుల్లో గడిపిన ఓటర్లు హైదరాబాద్‌ శివార్లలోని బసకు చేరుకున్నారు. అయితే అంతటితో సరిపెట్ట కుండా అభ్యర్థుల నుంచి అ‘ధనం’ఆశిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఓటర్లు కనీసం రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. ‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ పదవులు ఆశించేవారు ప్రస్తుతం ఎలాంటి సాయం ఆశించకండి. సాయం ఆశిస్తే భవిష్యత్తు అవకాశాలు ఉండవు’అని చెప్పినా ఓటర్లు మాత్రం తక్షణ లబ్ధివైపే మొగ్గు చూపుతు న్నట్లు సమాచారం. ఓటర్లను సంతృప్తి పరచడంపై గురువారం రాత్రి వరకు సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు మంతనాలు జరిపి ఓటర్లకు స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. 

ఇదిలా ఉంటే ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిన ఆరు స్థానాల్లో తమకు ఎలాంటి హామీలు దక్కకపోవడంపై ఓటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే క్యాంపుల నిర్వహణకు ఖర్చు తడిసి మోపెడు కావడం పట్ల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార పార్టీతో పాటు ఖమ్మం, మెదక్‌లో కాంగ్రెస్‌ కూడా శిబిరాలు ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్‌కు తమ పార్టీ ఓటర్లు దూరంగా ఉంటారని ఏఐసీసీ సభ్యుడు కె.ప్రేమ్‌సాగర్‌రావు ప్రకటించారు. క్రాస్‌ ఓటింగ్‌ జరగకుండా ఉండేందుకు తాము ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే కరీంనగర్‌లో బీజేపీ మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా తన పరిధిలో ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement