అది కేసీఆర్ సొంత ఇల్లు కాదు: గుత్తా
నల్లగొండ: పాత పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బడాబాబుల చర్యలు తీసుకుని నల్లధనం వెలికితీస్తే ప్రధాని నరేంద్ర మోదీకి క్రెడిట్ దక్కేదని చెప్పారు.
తాను రాసిన లేఖ వల్లే కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లు రద్దు చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారని, ఆ లేఖలో ప్రత్యామ్నాయాలు కూడా రాసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ సీఎం కొత్త క్యాంపు కార్యాలయంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. క్యాంపు ఆఫీసు కేసీఆర్ సొంతిల్లు కాదని, ప్రభుత్వ భవనమని స్పష్టం చేశారు. కాగా, హైదరాబాద్ లోని బేగంపేటలో కొత్తగా నిర్మించిన అధికార నివాస భవన సముదాయంలోకి గురువారం తెల్లవారుజామున 05.22 నిమిషాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు గృహప్రవేశం చేశారు.