చంద్రబాబుది మొసలి కన్నీరు
నీలగిరి : తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొం టున్న విద్యుత్ కొరతను నివారించడంలో ఏపీ సీఎం చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం నల్లగొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 54 శాతం విద్యుత్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అవసరమైతే ఏపీలో నాలుగు గంటలపాటు కోత విధించైనా మరో నాలుగు గంటలపాటు అదనపు విద్యుత్‌ను తె లం గాణ ఇవ్వడంతోపాటు, ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై కూడా ఉందన్నారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ బేషజాలకు పోకుండా చంద్రబాబుతో సంప్రదించి పరస్పర సహకారంతో రావాల్సిన విద్యుత్‌ను తెప్పించుకోవడంతోపాటు, అదనపు విద్యుత్ కొనుగోలుకు చర్చిం చాలన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు పట్టుదలకు పోవడం వల్ల నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో నీరు వృథాగా కిందికి పోతుందన్నారు.
విద్యుదుత్పాదన పేరుతో రెండు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఖాళీ అయిన పక్షంలో రెండో పంటకు నీరు ఇవ్వడం కష్ట సాధ్యమవుతుందన్నారు. దీంతో ఖమ్మం, నల్లగొండ జిల్లా రైతాంగం పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. వచ్చే వేసవిలో తాగునీటి కొరత తీవ్రంగా ఉండే పరిస్థితులున్న నేపథ్యంలో...రెండు ప్రాజెక్టుల్లో నీటిని నిల్వను కాపాడుకోవాలన్నారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డుల త రహాలోనే ప్రజలకు ఆరోగ్య శ్రీ కార్డులను కూడా కేసీఆర్ ఇవ్వాలన్నారు. 25 ఎకరాల రైతు సైతం లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే స్థితిలో లేడన్నారు. గతంలో ఉన్న రేషన్‌కార్డుల మించి ప్రస్తుతం ఆహారభద్రత కార్డులకు ఎక్కువ దరఖాస్తులు రావడం వెనక ప్రజల ఉద్దేశం ఇదేనని తెలిపారు. సీఎం కేసీఆర్ స్పందించి తక్షణమే ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, తిప్పర్తి ఎంపీపీ పాశం రాంరెడ్డి పాల్గొన్నారు.