
స్థానికతపై వివాదం సరికాదు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానికత అంశంపై అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఆయన
నల్లగొండ :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానికత అంశంపై అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఆయన నివాసంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1956 ముందు స్థిరనివాసం ఏర్పరచుకున్న వారినే స్థానికులుగా పేర్కొనడం సరైంది కాదన్నారు. స్థానికత విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయని, దాంతో పాటు జోనల్ సిస్టమ్ కూడా అమల్లో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం తర్వాత స్థానికులు ఎవరు అనే దానిపై పూర్తిస్థాయిలో చర్చించి ఓ పరిష్కారం కనుగొన్నారని గుత్తా తెలిపారు. ప్రస్తుతం ఆ విధానమే అమల్లో ఉందని, దానినే కొనసాగించాలని చెప్పారు. స్థానికతపై లేనిపోని అపోహలు, అనుమానాలు లేవనెత్తి కొత్త సమస్యలు సృష్టించొద్దని సూచించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న తాగు, సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జిల్లా మం త్రి, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. త్వరలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు జరిపేలా కృషిచేయాలన్నారు.
వరికి మద్దతు ధర కంటితుడుపు చర్యే
మోడీ ప్రభుత్వ నెలరోజుల పాలనలో ఎలాంటి చర్యలు చేపట్టలేదని గుత్తా విమర్శించారు. వరికి మద్దతు ధర కేవలం రూ.45లు మాత్రమే పెంచడాన్ని కంటితుడుపు చర్యగా ఆయన అభివర్ణించారు. రైతుల రుణ మాఫీ కంటే కూడా పండిన పంటకు మద్దతు ధర కల్పిస్తేనే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబు కూడా ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో రైతుల పంట రుణాలను మాఫీ చేసేం దుకు ఆయన మల్లగుల్లాలు పడుతున్నారని గుత్తా ఎద్దేవా చేశారు.