నిన్నమొన్నటి వరకు వారిద్దరూ ఒకే పార్టీలో ఉండి కలిసి పని చేసిన వారు. మనస్పర్ధలున్నా ఏకతాటిపై నడిచారు. ఇద్దరు ఓ ఉన్నత హాదాల్లో ఉన్నవారు. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య సఖ్యత చెడింది. మాటల యుద్ధం మొదలయ్యింది. రోజు రోజుకూ అంతరాలు పెరుగుతున్నాయి. ఒక వైపు మాటల తూటాలు, మరో వైపు నియోజకవర్గంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. వారిద్దరిలో ఒకరు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కాగా, మరొకరు నల్లగొండ జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్. దేవరకొండ
మూడు సార్లు ఎంపీగా పని చేసిన అనుభవం, దేవరకొండ నియోజకవర్గంపై పట్టున్న నాయకుడు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి. ఎమ్మెల్యేగా పని చేసి అన్నీ తానై నియోజకవర్గంలో అన్ని జెడ్పీటీసీ స్థానాలను, ఎంపీపీ స్థానాలను ఒంటి చేత్తో గెలిపించుకున్న నాయకుడు బాలునాయక్. నిన్నమొన్నటి వరకు వీరిద్దరూ కలిసే పని చేశారు. దేవరకొండ నియోజకవర్గంలో వీరిద్దరికి మంచి పేరుంది. అయితే మారిన సమీకరణలు, పొత్తులు, ఎత్తుల కారణాలతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య సఖ్యతలేదు. మాటల యుద్ధం పెరుగుతోంది. దేవరకొండ ఎమ్మెల్యేగా పని చేసిన బాలునాయక్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో చేరారు. దీంతో ఆయన వెంట నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు కదిలారు. ఇంత వరకు బాగానే ఉన్నా వీరిద్దరూ ప్రస్తుతం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ పార్టీలో ఒకరి కుట్ర వల్ల తాను బలైనట్లు తనపై గతంలో కుట్ర జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడానికి ఓ వ్యక్తే కారణమంటూ పరోక్షంగా గుత్తాను విమర్శించారు. ఓ వైపు జానారెడ్డిని కొనియాడుతూనే గుత్తా సుఖేందర్‌రెడ్డిని విమర్శించారు. తనను నమ్ముకున్న జనం కోసం, నియోజకవర్గ అభివద్ధి కోసం పార్టీ మారినట్లు స్పష్టం చేశారు. ఇదే నేపథ్యంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా ప్రత్యారోపణలు ప్రారంభించారు. తాను మోసం అన్న మాట ఎరుగనని, కుట్రలు తనకు తెలియవని చెబుతూనే పొత్తులో భాగంగా దేవరకొండ సీటు గల్లంతయినా సమష్టిగా పనిచేసి బాలునాయక్‌ను జెడ్పీ చైర్మన్‌ను చేశామన్నారు. అవసరాల కోసం వెళ్లి అనవసర ఆరోపణలు చేయవద్దని విమర్శించారు. అయితే ఈ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైనా వారి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మాత్రం గత కొంత కాలం నుంచే నడుస్తోంది.
తన సీటు గల్లంతు కావడానికి గుత్తా సుఖేందర్‌రెడ్డే కారణమన్న బలమైన నమ్మకంతో బాలునాయక్ ఉండగా, క్యాడర్‌ను మొత్తం ఆయన టీఆర్‌ఎస్‌లోకి చేర్చే ప్రయత్నం చేస్తుండగా వీరిద్దరి మధ్య అంతరం పెరిగింది. నియోజకవర్గంలో పట్టు కోసం ఇరువురు ప్రయత్నిస్తుండగా గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ క్యాడర్‌కు దేవరకొండ నియోజకవర్గానికి ఎంపీనైనా, ఎమ్మెల్యేనైనా తానేనని అన్నింటా ముందుంటానని భరోసా కల్పిం చడం, దేవరకొండకు తరచు ఆయన వస్తుండటంతో ఆయన కూడా నియోజకవర్గంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. పార్టీపరంగా నియోజకవర్గంలో గుత్తాకంటూ కొంత విశ్వసనీయత ఉండటంతో ఆయన నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఏదేమయినా వీరిద్దరి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం ఎవరికి లాభిస్తుందో, ఎవరికి నష్టం చేకూరుస్తుందో వేచి చూడాలి.
మాటల యుద్ధం
Published Tue, Feb 10 2015 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM
Advertisement
Advertisement