తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ యాత్ర ఓ నాటకమని నల్గొండ లోక్సభ సభ్యుడు గుత్తా సుఖేంధర్ రెడ్డి అభివర్ణించారు. ఆదివారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసమే బాబు ఢిల్లీ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టె పనిలో భాగంగానే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంత ప్రస్తావన చేస్తున్నారని గుత్తా సుఖేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వద్దనే హక్కు సీమాంధ్ర నేతల భార్యలకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందని ప్రజాప్రతినిధుల భార్యలు శనివారం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. నల్గొండ సమావేశంలో విలేకర్లు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల భార్యలు ప్రణబ్ను కలసి విజ్ఞప్తి చేయడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు గుత్తా సుఖేందర్ రెడ్డిపై విధంగా సమాధానం ఇచ్చారు.