సాక్షి, నల్గొండ: పార్టీ మారుతున్నానని మీడియాలో వస్తున్న వార్తలను ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఖండించారు. తాను పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఎప్పుడూ పాటు పడతానన్నారు. మెడికల్ కాలేజ్, బత్తాయి మార్కెట్ కోసం సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించానని వివరించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వచ్చిన మెజార్టీ పదివేలు మాత్రమేనని, ఆయనకు వచ్చిన ఓట్లు 60 వేలు అయితే సీఎంపై లక్ష ఓట్లతో మెజార్టీ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కోమటిరెడ్డి అబద్ధాల పుట్ట అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డికి ప్రజలు బుద్ది చెబుతారన్నారు. ఇప్పటికైనా ప్రగల్భాలు మానుకోవాలని కోమటిరెడ్డికి గుత్తా సూచించారు.
కాగా టీడీపీ నేత కంచర్ల భూపాల్‌రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకోవడంపై గుత్తా సుఖేందర్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. కంచర్ల సోదరులు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందుగానే కంచర్ల సోదరులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే కంచర్ల సోదరులకు పార్టీలో గౌరవం కల్పిస్తామని కేసీఆర్ హమీ ఇచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ హమీ మేరకే కంచర్ల భూపాల్‌రెడ్డికి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ పదవిని కట్టబెట్టారు. అంతేకాదు ఇప్పటివరకు ఇంఛార్జీగా ఉన్న దుబ్బాక నర్సింహ్మరెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. ఈ పరిణామంతో సుఖేందర్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం టీఆర్‌ఎస్ వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment