లగడపాటికి భగత్ సింగ్కు పోలికా ?
విజయవాడ లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ను స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్తో పోల్చడం హాస్యాస్పందంగా ఉందని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లొండలో విలేకర్లతో మాట్లాడారు. ఆంగ్లేయుల బానితస్వంలో మగ్గుతున్న భారత దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పరితపించి భగత్ సింగ్ అశువులుబాసారని గుత్తా ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాంటి మహానియుడితో లగడపాటిని పోలుస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లును అడ్డుకునే పార్టీలకు పతనం తప్పదని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ బిల్లును పార్లమెంట్లో అడ్డుకుంటామని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఇటీవల ప్రకటించారు. ఆ క్రమంలో గురువారం లోక్సభకు బిల్లు వచ్చింది. ఈ నేపథ్యంలో సభ వెల్ లోకి సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎంపీ దూసుకొచ్చారు దాంతో ఆయనను అడ్డుకొనేందుకు కొంత మంది ఎంపీలు ప్రయత్నించారు. సీమాంధ్ర టీడీపీ ఎంపీని రక్షించేందుకు అక్కడకు చేరుకున్న లగడపాటిని కూడా అడ్డుకునేందుకు ఆ సదరు ఎంపీలు ప్రయత్నించారు. దాంతో లగడపాటి ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే ను స్ప్రే చేశారు. దాంతో లోక్సభలో తీవ్ర భయానక పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో సభలో లగడపాటి వ్యవహరించిన తీరు పట్ల సీమాంధ్ర ప్రజలు హర్షం ప్రకటించారు. దాంతో లగడపాటి ఆంధ్రప్రదేశ్ భగత్ సింగ్ అంటూ మీడియాలో ప్రచార హోరు మిన్నంటింది. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డిపై విధంగా స్పందించారు.