లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌లో రాజీనామాలు వెల్లువెత్తుతున్నాయి
సాక్షి నెట్‌వర్క్: లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌లో రాజీనామాలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రులు మొదలు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు, వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి పురందేశ్వరి తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు రాజకీయ సన్యాసం ప్రకటించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డిలు కూడా తమ పదవులకు, పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.
విశాఖ జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు పంచకర్ల రమేష్‌బాబు(పెందుర్తి), ముత్తంశెట్టి శ్రీనివాస్ (భీమిలి), చింతపూడి వెంకట్రామయ్య( గాజువాక), యూవీ రమణమూర్తి (యలమంచిలి)లు పదవులకు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేశారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు (గిద్దలూరు), డాక్టర్ ఆదిమూలపు సురేష్ (యర్రగొండపాలెం)లతో పాటు కొండపి నియోజకవర్గం జరుగుమల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.జయప్రసాదరావులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తమ పదవులకు రాజీనామా చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీకి రాజీనామా చేసినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. కృష్ణాజిల్లా గన్నవరం మాజీ శాసనసభ్యుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ను వదిలారు. చిత్తూరు శాసనసభ్యుడు సీకే బాబు అలియూస్ జయచంద్రారెడ్డి మంగళవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు.
కోర్టుకు వెళతాం: కావూరి సాంబశివరావు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై తాము సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్టు కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు పేర్కొన్నారు. మరో కేంద్రమంత్రి జేడీ శీలం కాంగ్రెస్ అధ్యక్షురాలికి లేఖ రాశారు.
లగడపాటి రాజకీయ సన్యాసం
లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడంతో కలత చెంది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ బహిష్కృత విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మంగళవారం ప్రకటించారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. లోక్‌సభ సచివాలయానికి రాజీనామా లేఖను పంపానని, దాన్ని ఆమోదించుకునేందుకు బుధవారం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను కలవనున్నట్లు చెప్పారు.