ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే: లగడపాటి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో పెప్పర్ స్ప్రే వాడిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాను చేసిన దాంట్లో ఎలాంటి తప్పూ లేదని సమర్థించుకున్నారు. ఆత్మరక్షణ కోసమే తాను పెప్పర్ స్ప్రే ప్రయోగించానని స్పష్టంచేశారు. గురువారం పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘సభ వెల్‌లో నిరసన తెలుపుతున్న టీడీపీ ఎంపీ వేణుగోపాల్‌రెడ్డిని కొందరు కాంగ్రెస్ ఎంపీలు చుట్టుముట్టారు. ఆయన్ను రక్షించడానికి మరోవైపు నుంచి నేను అక్కడికి దూసుకెళ్లాను. అయితే వారు నాపై దాడి చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆత్మరక్షణార్థం వారిపై పెప్పర్ స్ప్రే కొట్టాను’’ అని లగడపాటి అన్నారు. ఇప్పటికే తనపై ఎన్నోమార్లు దాడులు జరిగాయని, అయినా ఏనాడూ గన్‌మెన్లను పెట్టుకోలేదని చెప్పారు. తనకు తీవ్ర ముప్పు ఉన్న దృష్ట్యా తన జేబులో ఎప్పుడూ పెప్పర్ స్ప్రే పెట్టుకుంటానని ఆయన అన్నారు. అది నిజమేనని పక్కనే ఉన్న సీమాంధ్ర ఎంపీలు చెప్పుకొచ్చారు.
చేసిందంతా చేసి కాంగ్రెస్ నిందలేస్తోంది: ఆస్తమా, ఇతర శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడే సీనియర్ సభ్యులున్న సభలో వారికి హానికలిగించే పెప్పర్ స్ప్రే వాడడం సమంజసమేనా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘తమపై దాడి, అత్యాచారం జరుగుతుందని భావించినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి మహిళలు పెప్పర్ స్ప్రే వాడుతుంటారు. ఇక్కడ నాపై దాడి జరిగింది. అందుకే ఉపయోగించాను’’ అని లగడపాటి అన్నారు.
ప్రతిపక్షాల మద్దతుతో నడుస్తున్న చేతకాని సర్కారిది: లోక్‌సభలో తెలంగాణ బిల్లును స్పీకర్ ప్రవేశపెట్టిన తీరు పక్షపాత ధోరణిని పట్టిచూపుతోందని లగడపాటి అన్నారు. ఎవరి అంగీకారం లేకుండానే ఎవరూ ఎస్, నో అని చెప్పకుండానే సభలో బిల్లుపెట్టామనడాన్ని ప్రతిపక్షాలు సైతం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ భవిష్యత్తు కోసమే స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గురువారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మరోసారి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల మద్దతుతో నడుస్తున్న సంఖ్యా బలంలేని, చేతకాని ప్రభుత్వం ఏకపక్షంగా ఇలా వ్యవహరిస్తోందన్నారు. బిల్లు ప్రవేశపెడుతున్న సమయం లో తాము నిరసన తెలిపేందుకు వెల్‌లోకి వెళ్లినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే తెలంగాణతోపాటు మిగిలిన రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు వంద మంది వరకు వెల్‌లోకి దూసుకొచ్చి తమపై దాడికి యత్నించారన్నారు.
అడ్డుకుంటే వెలేయాలని గతంలో అన్న లగడపాటి!
రాజకీయాల్లో ఇంతకు మించిన వైచిత్రి ఉండదేమో! లోక్‌సభలో మిరియాల ద్రావకం చల్లి అంతులేని గందరగోళానికి కారణమైన విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్, నిజానికి పార్లమెంటులో సభ్యులు అమర్యాదకరంగా ప్రవర్తించకుండా నియంత్రించాలంటూ ఒకప్పుడు వాదించారు! అంతేకాదు, ఆ మేరకు 2009 జూలై 31న లోక్‌సభలో ప్రైవేట్ బిల్లును విజయవంతంగా ప్రవేశపెట్టారాయన!! సభా కార్యకలాపాలను అడ్డుకునే వారికి జరిమానాలు విధించాలని కూడా ఆయన ప్రతిపాదించారు. ఒకే సెషన్‌లో మూడుసార్లు సభా కార్యకలాపాలను అడ్డుకుంటే ఆ ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని అందులో లగడపాటి ప్రతిపాదించారు!