
అశోక్‌బాబు 56 రోజుల నాయకుడు: ఎంపీ గుత్తా
నల్లగొండ: హైదరాబాద్ నుంచి ఎవరు వెళ్లిపోవాలనే విషయం మరో మూడు నెలల్లో తేలుతుందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ వాళ్లే హైదరాబాద్ వదిలివెళ్లాలని ఏపీఎన్‌జీఓ నాయకుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
స్పాన్సర్డ్ సీమాంధ్ర ఉద్యమానికి అశోక్‌బాబు 56 రోజుల కొత్త నాయకుడని, వాపును చూసి బలుపు అనుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించబోమన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే 10 లక్షల మందితో హైదరాబాద్‌ను ముట్టడిస్తామని అల్టిమేటం ఇస్తున్న అశోక్.. తెలంగాణ ప్రజలు తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఉద్యమం చేస్తే మా ఉద్యమంలా ఏళ్లకొద్దీ చేసుకోండి.. కానీ రెచ్చగొట్టి విద్వేషాలు కలిగించే రీతిలో మాట్లాడితే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
జగన్‌కు బెయిలొస్తే.. చంద్రబాబుకే బెంగ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ వస్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు బెంగ ఉంటుంది.. కానీ, మాకెందుకుంటుందని ఎంపీ గుత్తా వ్యాఖ్యానించారు. చట్టప్రకారం అరెస్టులు, విడుదలలు సర్వసాధారణమని, జగన్ విడుదలవడంపై ఆశ్చర్యపడాల్సిందేమీ లేదన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన బీజేపీతో పొత్తు కోసమేనని, రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన చర్చల సారాంశాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. అక్టోబర్ 3న జరిగే కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నోట్‌పై చర్చ జరుగుతుందని, ఏకే ఆంటోనీ అనారోగ్య పరిస్థితులతోనే కొంత ఆలస్యమవుతోందని తెలిపారు.