Seemandhra Stir
-
జూనియర్ కాలేజ్‌కి నిప్పు పెట్టిన సమైక్యవాదులు
-
అశోక్‌బాబు 56 రోజుల నాయకుడు: ఎంపీ గుత్తా
నల్లగొండ: హైదరాబాద్ నుంచి ఎవరు వెళ్లిపోవాలనే విషయం మరో మూడు నెలల్లో తేలుతుందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ వాళ్లే హైదరాబాద్ వదిలివెళ్లాలని ఏపీఎన్జీఓ నాయకుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. స్పాన్సర్డ్ సీమాంధ్ర ఉద్యమానికి అశోక్‌బాబు 56 రోజుల కొత్త నాయకుడని, వాపును చూసి బలుపు అనుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించబోమన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితే 10 లక్షల మందితో హైదరాబాద్‌ను ముట్టడిస్తామని అల్టిమేటం ఇస్తున్న అశోక్.. తెలంగాణ ప్రజలు తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఉద్యమం చేస్తే మా ఉద్యమంలా ఏళ్లకొద్దీ చేసుకోండి.. కానీ రెచ్చగొట్టి విద్వేషాలు కలిగించే రీతిలో మాట్లాడితే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్‌కు బెయిలొస్తే.. చంద్రబాబుకే బెంగ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ వస్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు బెంగ ఉంటుంది.. కానీ, మాకెందుకుంటుందని ఎంపీ గుత్తా వ్యాఖ్యానించారు. చట్టప్రకారం అరెస్టులు, విడుదలలు సర్వసాధారణమని, జగన్ విడుదలవడంపై ఆశ్చర్యపడాల్సిందేమీ లేదన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన బీజేపీతో పొత్తు కోసమేనని, రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన చర్చల సారాంశాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. అక్టోబర్ 3న జరిగే కేంద్ర కేబినెట్లో తెలంగాణ నోట్‌పై చర్చ జరుగుతుందని, ఏకే ఆంటోనీ అనారోగ్య పరిస్థితులతోనే కొంత ఆలస్యమవుతోందని తెలిపారు. -
విద్యుత్ సమ్మెలో సడలింపు
-
విద్యుత్ సమ్మెలో సడలింపు
* సీఎంతో భేటీ తర్వాత సేవ్ జేఏసీ నిర్ణయం * నిరవధికం కాదు.. బుధవారం అర్ధరాత్రి నుంచి 72 గంటల సమ్మె * సీమాంధ్రలో అత్యవసర సేవలు మినహా ఇతర విధులకు దూరం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తలపెట్టిన నిరవధిక సమ్మెను సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు సడలించారు. 11వ తేదీ అర్ధరాత్రి నుంచి మూడురోజులు (72 గంటలు) మాత్రమే సమ్మె చేయనున్నట్టు సమైక్య ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల (ఎస్‌ఏవీఈ-సేవ్) సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రకటించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సేవ్ జేఏసీ నేతలు సాయిబాబా, శ్రీనివాస్, నర్సింహులు, అనురాధ తదితరులు తెలిపారు. మూడురోజుల పాటు ఆసుపత్రులు, వ్యవసాయం, మంచినీటి సరఫరా, ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి వంటి అత్యవసర సేవలు మినహా మిగిలిన విధులకు దూరంగా ఉంటామని చెప్పారు. బుధవారం సాయంత్రం జేఏసీ నేతలు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని సీఎం వారిని కోరారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా ఆగిపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతారని.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమ్మె చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఏపీఎన్‌జీవోలతోనూ సమ్మె విరమణపై చర్చిస్తామని సీఎం చెప్పినట్లు తెలిసింది. అయితే కేంద్ర కేబినెట్ ముందుకు విభజన నోట్ వచ్చిన వెంటనే నిరవధిక సమ్మె చేస్తామని నేతలు పేర్కొనగా.. అసెంబ్లీ ముందుకు విభజన తీర్మానం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరినట్టు తెలిసింది. ఆద్యంతం నాటకీయం విద్యుత్ ఉద్యోగుల సమ్మె విషయంలో బుధవారం అద్యంతం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించాలని ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, జెన్కో విజయానంద్ ఎండీలు మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్‌సౌధలో మీడియా ద్వారా ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. సీపీడీసీఎల్ సీఎండీ రిజ్వీ కూడా సమావేశంలో పాల్గొన్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగా లేదని.. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో జల విద్యుత్ పెరిగి విద్యుత్ సరఫరా మెరుగుపడిన పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లడం వల్ల మళ్లీ విద్యుత్ సరఫరా సమస్య తలెత్తుతుందని అన్నారు. అందుకు అంగీకరించని జేఏసీ నేతలు సమ్మె విషయమై చర్చించేందుకు సమయం కావాలని సీఎంను కోరారు. గురువారం ఉదయం 10.30కి సీఎం అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించారు. దీంతో విజయానంద్ మధ్యవర్తిత్వం నెరపి సీఎంతో ఉద్యోగులు బుధవారం సాయంత్రమే సమావేశమయ్యేలా చూశారు. సీఎంతో చర్చల అనంతరం సమ్మెను సడలిస్తూ ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల్లో ఆర్టీపీపీ పునరుద్ధరణ ఆర్టీపీపీలో విద్యుత్ సరఫరాను రెండు మూడు రోజుల్లో పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని జెన్కో ఎండీ విజయానంద్ బుధవారం తెలిపారు. భారీ వర్షాల వల్ల కోల్ హ్యాండ్లింగ్, పంప్‌హౌస్‌ల్లోకి నీరు ప్రవేశించిందని తెలిపారు. అప్పటికే ఒక యూనిట్లో మరమ్మతులు చేస్తున్నామని, నీరు రావడం వల్ల మిగతా నాలుగు యూనిట్లలోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశామని చెప్పారు. -
14 డిపోల్లో నిలిచిపోయిన 1200 బస్సులు
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో సమైక్యపోరు 36వ రోజుకు చేరింది.సమైక్యాంధ్రకు మద్దతుగా 14 డిపోల్లోని 1200 బస్సులు నిలిచిపోయాయి. అయితే తిరుమలకు మినహాయింపు ఇచ్చారు. మరోవైపు జేఏసీ దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. కాగా జిల్లావ్యాప్తంగా నిరసన ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విడిపోతే చెడిపోతాం అంటూ నిరసనకారులు ఊరూవాడా కదం తొక్కుతున్నారు. -
'తెలుగు జాతి క్షోభకు కారణం చంద్రబాబు'
రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకుని సీమాంధ్రలో బస్సు యాత్ర చేపట్టారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రశ్నించారు. చంద్రబాబుది సమైక్యవాదమా, వేర్పాటువాదమా తెలపాలన్నారు. లోక్‌సభ నుంచి సస్పెండయిన తర్వాత మిగతా ఎంపీలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల గుండెల్లో సమైక్యవాదం బలంగా ఉందని లగడపాటి చెప్పారు. ఇవాళ సీమాంధ్ర ప్రజలు రోడ్లకు పైకి ఉద్యమిస్తుంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టాలను కోవడం అయ్యే పనికాదన్నారు. ఏం చెప్పినా ప్రజలు పట్టించుకోరనుకుంటే పొరపాటని అన్నారు. తెలుగు జాతి క్షోభకు కారణం చంద్రబాబని, తెలుగుప్రజలను ఎన్నోసార్లు మోసం చేసిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. సీమాంధ్ర టీడీపీ నాయకులకు దమ్ము, ధైర్యంగా చంద్రబాబును నిలదీయాలన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా చంద్రబాబును ఒప్పించాలని డిమాండ్ చేశారు. -
హస్తినకు నేడు సీఎం కిరణ్
* అధిష్టానం పిలుపు.. * సమైక్య ఉద్యమం, తాజా పరిస్థితులపై చర్చ * నేడు ఆంటోనీ కమిటీ ముందుకు సీమాంధ్ర ప్రతినిధులు * అంతకుముందే ముఖ్యమంత్రి కిరణ్‌తో భేటీ కానున్న కమిటీ * ఢిల్లీ పర్యటనకు దూరంగా సీనియర్ మంత్రులు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. దీంతో ఆయన మంగళవారం ఉదయాన్నే ఢిల్లీ వెళ్లనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో సీమాంధ్రలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు సీఎంను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటివరకు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమంలో ఇటీవలి కాలంలో చెదురుమదురుగా అవాంఛనీయ సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజకీయపరమైన తాజా పరిస్థితులపై సీఎంతో పార్టీ పెద్దలు చర్చించనున్నారని తెలుస్తోంది. విభజన నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతంలో ఇంత తీవ్ర నిరసన ఎదురవుతుందని అంచనా వేయలేకపోయిన పార్టీ పెద్దలు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ఆదరాబాదరాగా వెలువరించిన అధిష్టానం... సీమాంధ్రనేతల ప్రతిఘటన నేపథ్యంలో దాని అమలులో మాత్రం నెమ్మదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేసి ఇరుప్రాంతాల కాంగ్రెస్ నేతలతో భేటీలు నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సోమవారం ఆంటోనీ కమిటీ ముందు హాజరై తమ వాదన వినిపించారు. సీమాంధ్రప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు మంగళవారం కమిటీని కలవనున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. విభజన కారణంగా పలు సమస్యలు తలెత్తుతాయని, భవిష్యత్తులో అవి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయని సీమాంధ్ర ప్రాంత నేతలు వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు సీమాంధ్రప్రాంత నేతలతో వరుసగా రెండుసార్లు నిర్వహించిన సమావేశంలో వారంతా ఈ సమస్యలను ఏకరవుపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రెండుసార్లూ తీర్మానాలు చేసి పార్టీ అధిష్టానానికి పంపారు. ఈ రెండింటిపైనా సీఎం, పీసీసీ అధ్యక్షులిద్దరూ సంతకాలు చేశారు. ఈ లేఖలు ఆంటోనీ కమిటీకి కూడా పంపించారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంగళవారం ఆంటోనీ కమిటీని కలవనున్న నేపథ్యంలో అంతకుముందుగానే సీఎం ఆ కమిటీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెలువరిస్తున్న అనుమానాలను ఆయన పార్టీ అధిష్టానానికి, ఆంటోనీ కమిటీకి వివరించనున్నారు. విభజన నిర్ణయం అమలులో తలెత్తే ఇతర క్లిష్ట సమస్యలను కూడా ఆయన పార్టీ పెద్దలకు తెలియచేయనున్నారని తెలుస్తోంది. ఢిల్లీకి సీమాంధ్ర నేతలు ఏకే ఆంటోనీ కమిటీ మంగళవారం రాత్రి అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పలువురు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం మంత్రులు శైలజానాథ్, కన్నా లక్ష్మీనారాయణ, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి హస్తిన వెళ్లారు. గంటా శ్రీనివాసరావు, మహీధర్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, పితాని సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, పార్థసారథి తదితర మంత్రులు మంగళవారం ఉదయం వెళ్లనున్నారు. విభజన వల్ల ఎదురయ్యే అంశాలపై సమగ్రమైన వివరాలతో ఒక నోట్‌ను ఆంటోనీ కమిటీకి అందించనున్నారు. అధిష్టానం కనుక తమ మాటను వినిపించుకోలేని పరిస్థితులు కనిపిస్తే మాత్రం అంతిమంగా తమ జిల్లాలను తెలంగాణతో పాటు కలిపి ఉంచాలన్న వాదనను తెరపైకి తేవాలని కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలు భావిస్తున్నారు. అయితే మంత్రి శైలజానాథ్, ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి సమైక్యవాదులుగా ఉన్నందున వారిద్దరూ ఈ విషయంలో మౌనందాల్చే పరిస్థితి కనిపిస్తోంది. దూరంగా సీనియర్ మంత్రులు సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులు, నేతలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అదే ప్రాంతానికి చెందిన సీనియర్ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి తదితరులు దూరంగా ఉండటం విమర్శలకు దారితీస్తోంది. ఒకరిద్దరు మంత్రులు ఈ బాధ్యతలను భుజాలకెత్తుకున్నా... వారు జూనియర్లు కావడంతో పార్టీ అధిష్టానంలో కానీ, ఇటు రాష్ట్ర నేతలపై కానీ అంతగా ప్రభావం పడడం లేదు. అదే సీనియర్లు రంగంలోకి దిగి ఉంటే అధిష్టానం కూడా ఒకింత స్పందించేందుకు అవకాశముంటుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. పైగా సీమాంధ్ర నేతలందర్నీ పదేపదే ఢిల్లీకి తీసుకువెళ్లడం తలకు మించిన భారంగా మారింది. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తున్నా... కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర కాంగ్రెస్ నేతలు మాత్రం ఎవరైనా ఢిల్లీ యాత్రకయ్యే ఖర్చులు భరిస్తేనే వస్తామన్నట్లుగా వ్యవహరిస్తుండడం బాధ్యతలు తీసుకున్న మంత్రులకు సమస్యగా మారింది. ‘‘మేమెన్ని సార్లని భరిస్తాం. విమాన టిక్కెట్లు తీయడం, ఢిల్లీలో వసతి, భోజన రవాణా ఏర్పాట్లు చేయించడం మావల్ల అయ్యేది కాదు. ఒకటిరెండుసార్లు అంటే ఫర్వాలేదు కానీ వరుసగా అన్నీ మేమే భరించాలంటే కష్టమే. అందుకే ఢిల్లీ యాత్ర ఉంది రండని సమాచారమిస్తున్నాం. సొంత ఖర్చులతో వచ్చేవారు వస్తారు. లేని వారు మానేస్తారు. ఇంతకుమించి మేము కూడా ఏమీ చేయలేం’’ అని ఒక నేత తమ బాధలు వివరించారు. -
సీమాంధ్రలో పేలుతున్న స్లో ‘గన్స్’
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యవాదులు చేస్తున్న నిరసనల్లో నినాదాలు హోరెత్తుతున్నాయి. ప్లకార్డులు, ఫ్లెక్సీలపై ఆందోళనకారులు రాసి, ప్రదర్శిస్తున్న నినాదాలు, వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలను ఎండగడ్తూ చిత్రించిన, రూపొందించిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లకు జనం నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. గత వారం రోజులుగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో నిరసనకారులు ప్రదర్శించిన ప్లకార్లుల్లోని నినాదాలు, వాల్‌పోస్టర్లలోని వ్యాఖ్యలు మచ్చుకు కొన్ని.... విభజనకు ముందు దర్జా... ఆ తర్వాత బికారి సమైక్యాంధ్రలో కుర్చీలో దర్జాగా ఉన్న కేసీఆర్.. విభజన జరిగితే బికారిగా మారతారంటూ రూపొందించిన ఫ్లైక్సీ అనంతపురం నగరంలో వెలిసింది. నాకు నచ్చని పదం రాజీనామా సినిమాల్లో చిరంజీవి డైలాగులను పేరడీ చేస్తూ విజయవాడలో ప్లకార్డులు ప్రదర్శించారు. నాకు తెలుగుభాషలో నచ్చనిది ఒకే ఒక్క పదం ‘రాజీనామా’ అంటూ ఠాగూర్ సినిమాలో డైలాగ్‌ను, నా ఇంటి ముందు ధర్నా చేయమని ముగ్గురికి చెప్పండి.. వారు ముగ్గురికి చెబుతారు.. వారు మరో ముగ్గురికి చెబుతారు.. అంటూ స్టాలిన్ సినిమాలో డైలాగ్‌ను పేర డీ చేశారు. బొత్స ఆచూకీ చెప్పండి ‘‘విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని వెతుక్కుంటూ వెళ్లి తప్పిపోయారు. ఆచూకీ తెలిసిన వారు సమైక్యాంధ్ర ఉద్యమ కార్యకర్తలకు తెలియజేయాలి.’’ అంటూ విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలో వాల్‌పోస్టర్ అంటించారు. తెలుగుతల్లికి సోనియా తూట్లు తెలుగు తల్లిని సోనియాగాంధీ బల్లెంతో పొడుస్తుంటే కారుతున్న రక్తాన్ని గద్ద రూపంలో కేసీఆర్ తాగుతున్న చిత్రాన్ని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ప్రదర్శించింది. రాష్ట్రం నుంచి తరిమికొట్టాలంటూ చిరంజీవి, బొత్స, గంటాశ్రీనివాసరావులను కోతి బొమ్మలుగా చిత్రీకరించినబ్యానర్‌ను తెలుగుశక్తి నేతలు విశాఖపట్నంలో ఊరేగించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ పాము.. చిరు చీటింగ్ జీవి... చెన్నైలో అవార్డులు సమైక్యాంధ్రను పరిరక్షించాలని కోరుతూ తమిళనాడు రాష్ట్రం చెన్నై మైలాపూర్‌లో తెలుగు సంఘాలు బుధవారం నిరాహారదీక్ష నిర్వహించాయి. ఈ సందర్భంగా వ్యంగ్యోక్తులతో అవార్డులను ప్రకటించారు. సోనియాకు ‘విభజన విధ్వంస స్వరూపిణి’, కేసీఆర్‌కు ‘ఫామ్ హౌస్ పాము’, చిరంజీవికి ‘చీటింగ్ జీవి’, పురంధేశ్వరికి ‘పితృ ఆత్మక్షోభకారిణి’, సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ‘సోనియా పెట్స్’, కాంగ్రెస్ అధిష్టానానికి ‘అష్టదరిద్ర స్థానం’ అవార్డులను ప్రకటించారు.