సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యవాదులు చేస్తున్న నిరసనల్లో నినాదాలు హోరెత్తుతున్నాయి. ప్లకార్డులు, ఫ్లెక్సీలపై ఆందోళనకారులు రాసి, ప్రదర్శిస్తున్న నినాదాలు, వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలను ఎండగడ్తూ చిత్రించిన, రూపొందించిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లకు జనం నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. గత వారం రోజులుగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో నిరసనకారులు ప్రదర్శించిన ప్లకార్లుల్లోని నినాదాలు, వాల్‌పోస్టర్లలోని వ్యాఖ్యలు మచ్చుకు కొన్ని....
విభజనకు ముందు దర్జా... ఆ తర్వాత బికారి
సమైక్యాంధ్రలో కుర్చీలో దర్జాగా ఉన్న కేసీఆర్.. విభజన జరిగితే బికారిగా మారతారంటూ రూపొందించిన ఫ్లైక్సీ అనంతపురం నగరంలో వెలిసింది.
నాకు నచ్చని పదం రాజీనామా
సినిమాల్లో చిరంజీవి డైలాగులను పేరడీ చేస్తూ విజయవాడలో ప్లకార్డులు ప్రదర్శించారు. నాకు తెలుగుభాషలో నచ్చనిది ఒకే ఒక్క పదం ‘రాజీనామా’ అంటూ ఠాగూర్ సినిమాలో డైలాగ్‌ను, నా ఇంటి ముందు ధర్నా చేయమని ముగ్గురికి చెప్పండి.. వారు ముగ్గురికి చెబుతారు.. వారు మరో ముగ్గురికి చెబుతారు.. అంటూ స్టాలిన్ సినిమాలో డైలాగ్‌ను పేర డీ చేశారు.
బొత్స ఆచూకీ చెప్పండి
‘‘విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని వెతుక్కుంటూ వెళ్లి తప్పిపోయారు. ఆచూకీ తెలిసిన వారు సమైక్యాంధ్ర ఉద్యమ కార్యకర్తలకు తెలియజేయాలి.’’ అంటూ విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలో వాల్‌పోస్టర్ అంటించారు.
తెలుగుతల్లికి సోనియా తూట్లు
తెలుగు తల్లిని సోనియాగాంధీ బల్లెంతో పొడుస్తుంటే కారుతున్న రక్తాన్ని గద్ద రూపంలో కేసీఆర్ తాగుతున్న చిత్రాన్ని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ప్రదర్శించింది. రాష్ట్రం నుంచి తరిమికొట్టాలంటూ చిరంజీవి, బొత్స, గంటాశ్రీనివాసరావులను కోతి బొమ్మలుగా చిత్రీకరించినబ్యానర్‌ను తెలుగుశక్తి నేతలు విశాఖపట్నంలో ఊరేగించారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్ పాము.. చిరు చీటింగ్ జీవి... చెన్నైలో అవార్డులు
సమైక్యాంధ్రను పరిరక్షించాలని కోరుతూ తమిళనాడు రాష్ట్రం చెన్నై మైలాపూర్‌లో తెలుగు సంఘాలు బుధవారం నిరాహారదీక్ష నిర్వహించాయి. ఈ సందర్భంగా వ్యంగ్యోక్తులతో అవార్డులను ప్రకటించారు. సోనియాకు ‘విభజన విధ్వంస స్వరూపిణి’, కేసీఆర్‌కు ‘ఫామ్ హౌస్ పాము’, చిరంజీవికి ‘చీటింగ్ జీవి’, పురంధేశ్వరికి ‘పితృ ఆత్మక్షోభకారిణి’, సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ‘సోనియా పెట్స్’, కాంగ్రెస్ అధిష్టానానికి ‘అష్టదరిద్ర స్థానం’ అవార్డులను ప్రకటించారు.
సీమాంధ్రలో పేలుతున్న స్లో ‘గన్స్’
Published Fri, Aug 9 2013 5:21 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement
Advertisement