
'తెలుగు జాతి క్షోభకు కారణం చంద్రబాబు'
రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకుని సీమాంధ్రలో బస్సు యాత్ర చేపట్టారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రశ్నించారు. చంద్రబాబుది సమైక్యవాదమా, వేర్పాటువాదమా తెలపాలన్నారు. లోక్సభ నుంచి సస్పెండయిన తర్వాత మిగతా ఎంపీలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రజల గుండెల్లో సమైక్యవాదం బలంగా ఉందని లగడపాటి చెప్పారు. ఇవాళ సీమాంధ్ర ప్రజలు రోడ్లకు పైకి ఉద్యమిస్తుంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టాలను కోవడం అయ్యే పనికాదన్నారు. ఏం చెప్పినా ప్రజలు పట్టించుకోరనుకుంటే పొరపాటని అన్నారు.
తెలుగు జాతి క్షోభకు కారణం చంద్రబాబని, తెలుగుప్రజలను ఎన్నోసార్లు మోసం చేసిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. సీమాంధ్ర టీడీపీ నాయకులకు దమ్ము, ధైర్యంగా చంద్రబాబును నిలదీయాలన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా చంద్రబాబును ఒప్పించాలని డిమాండ్ చేశారు.