- పురపాలన కూడా పోలీస్ బాస్ చేతుల్లోనే
- 1902లో బడ్జెట్ రూ.82 వేలే
- కానిస్టేబుల్ జీతం ఆరు రూపాయలు
- కొత్వాల్ టు కమిషనర్ క్రమంలో ఎన్నో మార్పులు
నగర పరిపాలన, పురపాలనకు ఆద్యుడు అప్పటి కొత్వాలే... నిజాం హయాంలో హైద్రాబాద్ భద్రత మొత్తం ఆయనకే కట్టపెట్టారు. శాంతిభద్రతలతో పాటు ప్రజాపాలన కూడా కొత్వాల్ చేతులమీదుగానే సాగింది. ఆయన చేసిందే చట్టం, చెప్పిందే వేదం... 1847 నాటికి హైదరాబాద్.. గోల్కొండ నుంచి శివారు ప్రాంతాలకు విస్తరించింది. దీంతో శాంతిభద్రతల పర్యవేక్షణకు ‘కొత్వాల్’ను నియమించారు. నిజాంకు అతను జవాబుదారీగా ఉండేవాడు. పోలీస్ బాస్ ఏం చెబితే అదే చెల్లుబాటయ్యేది. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ స్థాయి అధికారిని ఈ స్థానంలో నియమించేవారు. విదేశీయులు కూడా నగర పోలీసు విభాగంలో పనిచేసేవారు. నిఘా కోసం డిటెక్టివ్స్‌ను పెట్టి శాంతిభద్రతలు, సమస్యలు తెలుసుకునేవారు.
నిజాంకు గూఢచారి
కొత్వాల్‌కు శాంతిభద్రతలు, న్యాయ, సాధారణ పాలనాధికారాలు అప్పగించారు. బ్రిటిష్ సేనల కదలికపై నిఘా కూడా ఆయన బాధ్యతే. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నియమించిన రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఆఖరి కొత్వాల్. గద్వాల్, వనపర్తి సంస్థానాల మధ్య విభేదాల్ని తొలగించడంలో కీలక పాత్ర పోషించారు.
కానిస్టేబుల్ జీతం ఆరు రూపాయలు
అప్పట్లో పోలీస్ స్టేషన్లను ఠాణాలుగా పిలిచేవారు. వీటిని ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షించేవాడు. ఏసీపీలను మదద్‌గార్ కొత్వాల్, డీసీపీలను నైబ్‌కొత్వాల్ అనేవారు. హెడ్-కానిస్టేబుల్‌ని జమేదార్, హెడ్-కానిస్టేబుల్‌ను (రైటర్) మెహ్‌రెరెగా వ్యవహరించేవారు. కానిస్టేబుల్‌ను మొదట్లో బర్ఖందాజ్ అని తర్వాత జవాన్‌గా పిలిచేవారు. 1902లో కానిస్టేబుల్ జీతం రూ.6లు. నగరం దాటి విధులు నిర్వర్తిస్తే.. రెండు అణాలు అలవెన్స్‌గా ఇచ్చేవారు. పురానీ హవేలీలో కొత్వాల్ కార్యాలయం ఉండేది. ప్రస్తుతం సౌత్‌జోన్ డీసీపీ, స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాలు అక్కడే కొనసాగుతున్నాయి. అప్పట్లో నగర పోలీసు విభాగంలో 1,542 మంది పదాతి దళం (ఫుట్ ఫోర్స్), 136 మంది అశ్వికదళం (మౌంటెడ్ పోలీస్) ఉండేవి. సంవత్సర బడ్జెట్ రూ.82,364గా ఉండేది.
1955లో పూర్తి మార్పులు
1955లో నగర పోలీసు వ్యవస్థలో పూర్తి మార్పులు చేశారు. మద్రాస్ నగర పోలీసు విధానాల్ని అమలుచేశారు. క్రైమ్, లా అండ్ ఆర్డర్‌ను వేరుచేశారు. హైదరాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు రైల్వే పోలీస్‌కి బదిలీ అవడంతో చాలా మార్పులు జరిగాయి. సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు కిందిస్థాయి సిబ్బందితో పెట్రోలింగ్ చేసేవారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. లా అండ్ ఆర్డర్, క్రైం, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలు ఏర్పాటు చేస్తూ 1957 అక్టోబర్ 11న నిర్ణయం తీసుకున్నారు.
పోలీసు బలగం 10 వేలు
పరిపాలనా సౌలభ్యం కోసం నగర కమిషనరేట్‌ను నాలుగు సబ్ డివిజన్లు, 12 సర్కిళ్లతో 34 పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేశారు. 1981లో కమిషనరేట్‌లో మళ్లీ మార్పులు చేసి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్లుగా విభజించడంతో పాటు 12 సబ్-డివిజన్లుగా మార్చారు. జోన్‌కు డీసీపీలు, సబ్-డివిజన్‌కు ఏసీపీలను అధికారులుగా చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారుల్ని నియమించారు. తొలిసారి డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ (ప్రస్తుత సీసీఎస్) అమల్లోకి వచ్చింది. 1992లో సంయుక్త పోలీసు కమిషనర్‌ల ఏర్పాటు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం నగర పోలీసు కమిషరేట్‌లో ఒక కమిషనర్, అదనపు కమిషనర్లు, ఆరుగురు సంయుక్త పోలీసు కమిషనర్లతో పాటు 15 మంది డీసీపీలు ఉన్నారు. పదుల సంఖ్యలో ఏసీపీలు, వందల సంఖ్యలో ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలతో సహా దాదాపు పది వేలమంది హైదరాబాద్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఏటా సిటీ పోలీస్ కమిషనరేట్ బడ్జెట్ రూ.100 కోట్ల పైనే ఉంది.