వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌లో అవినీతి రాజ్యమేలుతోంది. పర్మనెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో కొందరు చేతివాటాన్ని ప్రదర్శిస్తూ దొరికినకాడికి దోచుకుంటున్నారు. ఇదే క్రమంలో ఔట్ సోర్సింగ్‌లోని ఐటీ విభాగంలో కొన్నేళ్ల క్రితం చేరిన ఓ ఉద్యోగి తన ప్రత్యేక నైపుణ్యంతో అధికారులను బుట్టలో పడేశాడు. గ్రేటర్ సాంకేతిక విభాగాన్ని మొత్తం గుప్పిట పట్టి అక్రమాలకు పాల్పడుతున్నాడు. కీబోర్డు, కంప్యూటర్, మొబైల్, ల్యాప్‌టాప్, జిరాక్స్ మిషన్ల కొనుగోళ్లలో బినామీ వ్యాపారిగా మారి ఐటీని లూటీ చేస్తున్నాడు.
కొన్ని బినామీ, మరికొన్ని కమిషన్లు..
గ్రేటర్ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో, ఐటీ విభాగంలో ఏ వస్తువు కొనుగోలు చేసిన సదరు బాస్‌కు ముడుపులు ముట్టాల్సిందే. లేదంటే సవాలక్ష కొర్రీలు ఉంటాయి. కార్పొరేషన్‌లో వందల సంఖ్యలో కంప్యూటర్లు, స్కానర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఉన్నాయి. అయితే ఇందులో ఏది కొనుగోలు చేయాలన్నా ముందుగా ఐటీ బాస్ కమిషనర్‌కు నోట్ పెడతాడు. కొనుగోలుకు అనుమతి రావడంతో తన అనుభవాన్ని రంగరిస్తాడు. కీబోర్డులు, కంప్యూటర్లు, ట్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, జిరాక్స్ యంత్రాలు, మొబైల్ ఫోన్లు ఏదైనా తన కనుసన్నల్లో కొనుగోలు జరుగుతుంటాయి. కొన్ని బినామి పేర్లపై, మరికొన్ని కమిషన్లు పేరిట లావాదేవిలు సాగుతుంటాయి. 2015 ఆగస్టులో గ్రేటర్‌లో రూ. 2 కోట్లతో కంప్యూటర్లు, ట్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్కానర్లు, ట్యాబ్‌లు కొనుగోలు చేపట్టారు. అయితే ఇందులో సదరు ఐటీ బాస్ పెద్ద ఎత్తున కమిషన్లు అందుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో ఆయన తన సాఫ్ట్ ఆలోచనలతో ఆస్తి పన్నులను పెంచడం, తగ్గించడం, తొలగించడం లాంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా, ప్రతి ఏటా గ్రేటర్ వరంగల్ స్టేషనరీ, ముద్రణా, కంప్యూటర్లు, ఇంట ర్నెట్, మరమ్మతులు, ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లకు ఏటా రూ.80 లక్షల వరకు బడ్జెట్‌లో కేటాయిస్తోంది. ఇందులో అవసరాలను ఆధారంగా కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రతి కొనుగోలు వెనుక సదరు ఐటీ అధికారి భాగస్వామ్యం ఉంటుంది. లేదంటే తన కమిషన్ ముట్టచెప్పాలి. కుదరదు అంటే అనేక సాంకేతిక కారణాలు ఎత్తి చూపి, ఆ కంపెనీలకు బదులుగా మరో కంపెనీ పరికరాలు కొనుగోలు చేయడం జరుగుతోంది.
2000లో గ్రేటర్‌లో చేరిక..
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌లో 2000 సంవత్సరంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడలో భాగంగా అధికారులు నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిపై తీసుకున్నారు. ఇందులో ఓ వ్యక్తి రూ.4000 జీతంతో ఆపరేటర్‌గా విధుల్లో చేరాడు. అయితే కొద్ది రోజులకే తనదైన నైపుణ్యంతో ఉన్నతాధికారులకు దగ్గరై తాను పనిచేస్తున్న విభాగానికి బాస్ అయ్యాడు.
అన్నీ ఆయనే..
గ్రేటర్‌లో అన్నింటిలో కంటే ఐటీ విభాగం కీలకమైనది. రూ. కోట్ల ఆర్థిక లావాదేవిలు ఆన్‌లైన్ ద్వారా కొనసాగుతుంటాయి. ఇక్కడ పన్నుల విధింపు, ఫీజుల వసూళ్లు, వివిధ రకాల సాఫ్ట్‌వేర్లు, ప్రోగ్రామ్‌ల తయారీ జరుగుతోంది. అయితే ఇంత ప్రాధాన్యం కలిగిన విభాగానికి పర్మనెంట్ సూపరింటెండెంట్, ఓ అధికారి ఇన్‌చార్జిగా నియమించడం లేదు. ఈ క్రమంలో 18 ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అన్నీతానై ఐటీ బాస్‌గా కార్యకలాపాలు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం 50 మంది వరకు ఉన్న ఔట్ సోర్సింగ్ ఆపరేటర్లు, ప్రోగామర్లు, ఇతర సిబ్బంది ఈయన కనుసన్నల్లో నడుస్తుంటారు. అతడి దగ్గర తోక జాడించిన వారికి అంతర్గత బదిలీలు చేస్తున్నాడు. ఐటీ ఔట్ సోర్సింగ్ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్‌గా, బాస్‌గా పద్దెనిమిది ఏళ్లు ఒకే చోట విధులను చక్కబెడుతున్నాడు. సదరు ఐటీ బాస్ వారం రోజుల పాటు విధుల్లోకి రాకపోతే గ్రేటర్ ఆన్‌లైన్ లావా దేవీల కుప్పుకూలే విధంగా ప్రోగ్రామ్‌లు, సాఫ్ట్‌వేర్లు తన గుప్పిట్లో ఉంచుకోవడం గమనార్హం. గ్రేటర్ వరంగల్ అన్నీ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తింస్తుండగా, అధికారులు వింగ్ అధికారులు ఉన్నారు. కానీ శాశ్వత ఉద్యోగి, ఇన్‌చార్జి అధికారి లేకుండా నడుస్తున్న ఏకైక విభాగం ఉందంటే అది కేవలం ఐటీ విభాగం మాత్రమేనని చెప్పవచ్చు.
ఈ–స్క్రాప్ ఏమైంది..?
గత 18 ఏళ్లుగా కొనుగోలు చేసి పాడైన కంప్యూటర్లు, కీ బోర్డులు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమయ్యాయో అంతుచిక్కడం లేదు. నిబం ధనల మేరకు పాడైన ప్రతి పరికరాన్ని పక్కా లెక్కతో స్క్రాప్ కింద అమ్మి గ్రేటర్ ఖజానాకు సొమ్ము జమ చేయాలి. కానీ సదరు అధికారి పాడైనా, కాకున్నా పక్కదారి పట్టించి పెద్ద ఎత్తున జేబులు నింపుకుంటున్నాడు. రోజువారీగా స్టేషనరీ, ప్రింటర్ల, జిరాక్స్ ప్రింట్ల రంగు కొనుగోలు గోల్‌మాల్ జరుగుతోంది. ఐటీ బాస్ అవినీతి, అక్రమాలను తెలుసుకున్న బదిలీ కమిషనర్ ఇక్కడి నుంచి సర్కిల్ కార్యాలయానికి బదిలీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే తనపైఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎవరెమన్నా ఓపికగా తలాడిస్తూ ఐటీని లూటీ చేస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment