సాక్షి ప్రతినిధి, వరంగల్ / వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. పాలకవర్గ పదవీకాలం ముగిసే సమయం సమీపిస్తుండగా అధికారులు ఏర్పాట్లలో వేగం పెంచారు. మహానగర పాలక సంస్థ పరిధిలోని వార్డుల పునర్విభజన కీలక ఘట్టం కానుంది. ఆ దిశగా కూడా అధికారులు సన్నద్ధమయ్యారు. గత ఏడాది జనవరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలకు వార్డుల పునర్విభజన తర్వాతే ఎన్నికలు నిర్వహించారు. గ్రేటర్ వరంగల్‌లోనూ ఇదే విధానం కొనసాగనుంది. ఇప్పుడు ఉన్న 58 డివిజన్లను 66 డివిజన్లుగా పునర్విభజిస్తారు. ఈనేపథ్యంలో వార్డులు, కాలనీల తీసివేతలు, కూడికలపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. నేడో, రేపో పునర్వి భజన ఉత్తర్వులు అధికారికంగా వెలువడనున్నాయి. (చదవండి: చల్లా వ్యాఖ్యలు.. ‘సారీ’తో ఆగని ఆందోళనలు)
వచ్చే నెల 14 వరకు పాలకవర్గం గడువు
గ్రేటర్ వరంగల్ డివిజన్ల పునర్విభజన షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. డివిజన్ల పునర్విభజన, ఓటర్ల జాబితా లు, రిజర్వేషన్లు తేల్చేందుకు రెండు నుంచి మూడు నెలల గడువు అవసరమవుతుంది. గ్రేటర్ వరంగల్ ప్రస్తుత పాలక వర్గం పదవీ కాలం మార్చి 14తో ముగియనుంది. ఆలోగా కార్యకలాపాలన్నీ పూర్తి కావు. ఈ మేరకు పాలకవర్గం పదవీ కాలం పూర్తి కాగానే ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించి ఎన్నికల తతంగం పూర్తయ్యేంత వరకు కొనసాగుతారు. గతంలోనూ 2009 అక్టోబర్ నుంచి 2016 మార్చి 13వ తేదీ వరకు ప్రత్యేకాధికారి పాలన బల్దియాలో కొనసాగింది.
అదే తరహాలో మార్చి 14వ తేదీ తర్వాత మళ్లీ ప్రత్యేకాధికారి పాలన రాబోతుందన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్‌లోని డివిజన్ల పునర్విభజన ప్రక్రియకు బల్దియా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం కాగా, పురపాలక శాఖ నుంచి డివిజన్ల పునర్విభజన షెడ్యూల్ ఉత్తర్వులు రావడమే తరువాయిగా మిగిలింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పునర్విభజన షెడ్యూల్ విడుదల చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డివిజన్ల పునర్విభజన షెడ్యూల్ కోసం అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
జూలై 2019 ఆర్డినెన్సే ప్రామాణికం..
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం 2019 జూలైలో ఆర్డినెన్స్ జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా మున్సిపాలిటీల్లో జనాభాను వెల్లడించడంతో పాటు వార్డుల సంఖ్యను పెంచారు. ఆ ఆర్డినెన్స్‌లోనే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 8,19,416 మంది జనాభా ఉండగా, 58 వార్డులను 66కు పెంచనున్నట్లు వెల్లడించారు. అదే తరహాలో జనగామ, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, భూపాలపల్లి మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్యను సవరించారు. ఆ తర్వాతే గత ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించగా, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు కూడా అదే పద్ధతిలో నిర్వహించాల్సి ఉంది. తద్వారా వార్డుల పునర్విభజన అనివార్యంగా మారింది.
గ్రేటర్ వరంగల్‌లో 2011 నాటి జనాభా, వార్డులు, ప్రభుత్వం 2019 జూలైలో ప్రతిపాదించిన వార్డులు ఇలా...
♦జనాభా- 8,19,406
♦గతంలో డివిజన్లు- 58
♦ప్రతిపాదిత డివిజన్లు- 66
Comments
Please login to add a commentAdd a comment