నాగరాజు కుమారుడిని ఒడిలోకి తీసుకుని రోదిస్తున్న కమిషనర్ సత్పతి
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి తన పనేదో తాను చేసుకుని ఇంటికి చేరుకునే రకం కాదు. పనిలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమం విషయంలోనూ అంతే శ్రద్ధ చూపిస్తారు. చిన్నాపెద్దా తేడా లేకుండా సిబ్బందిలో ఎవరికి కష్టమొచ్చినా అండగా నిలుస్తారు. గత నెలలో గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా కరోనా బారిన పడిన సత్పతి.. ఇటీవలే కోలుకుని విధుల్లో చేరారు. తన క్యాంపు కార్యాలయంలో వంట మనిషిగా పనిచేసే తాళ్లపల్లి కమల కుమారుడు, బల్దియాలో తాత్కాలిక కార్మికుడు నాగరాజు(32) ఇటీవల అనారోగ్యం బారిన పడగా శుక్రవారం మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న కమిషనర్, మేయర్ గుండు సుధారాణితో కలసి హన్మకొండలోని వారి ఇంటికి వెళ్లి నాగరాజు మృతదేహం వద్ద నివాళులర్పించారు. తర్వాత మృతుడి తల్లి, భార్యను ఓదార్చారు. ఈ సందర్భంగా నాగరాజు భార్య తన రెండు నెలల పసిగుడ్డును పట్టుకుని రోదిస్తుండగా కమిషనర్ సత్పతిలోని తల్లి హృదయం మేల్కొంది. పసిగుడ్డును తన చేతిలోకి తీసుకున్న ఆమె కూడా కన్నీరు మున్నీరుగా రోదించారు. ఇటీవల నాగరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కరోనాతో బాధపడుతున్న కమిషనర్.. స్వయంగా వెళ్లలేక తన అమ్మానాన్నలను పరామర్శ కోసం పంపించడం విశేషం.
చదవండి: ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్ నాన్నకు..’
Comments
Please login to add a commentAdd a comment