- ఇదీ గ్రేటర్‌లో స్వాతంత్య్ర వేడుకల తీరు
- ఏఈ సస్పెన్షన్, డీఈకి నోటీసు
- గైర్హాజరైన వారికి కూడా నోటీసులు
మొరాయించిన మైకు.. ఉద్యోగుల గైర్హాజరు
Published Tue, Aug 16 2016 2:56 AM | Last Updated on Tue, Aug 21 2018 12:18 PM
వరంగల్ అర్బన్ : స్వాతంత్య్ర దినోత్సవమంటే అందరికీ ఉత్సాహమే.. కానీ ఎందుకో తెలియదు కానీ గ్రేటర్ అధికారులు ఇదేమీ పట్టలేదు. సోమవారం ఉదయం 7–10గంటలకు వరంగల్ బల్దియా కార్యాలయానికి మేయర్ నన్నపునేని నరేందర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ చేరుకున్నారు. కాసేపు వారి చాంబర్లలో ఉండి 7–25 గంటలకు జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రధాన కార్యాలయం ఎదుటకు వచ్చారు. కానీ అప్పటి వరకు కూడా అడిషనల్ కమిషనర్, గ్రేటర్ కార్యదర్శి, ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, కొందరు వింగ్ అధికారులు, సూపరింటెండెంట్లు రాలేదు. అయినా సరే మేయర్ జాతీయ జెండా ఎగురవేసి తన ప్రసంగాన్ని ప్రారంభించగానే మైకు మొరాయించింది. ఎలక్ట్రికల్ సిబ్బంది మరమ్మతులు చేసినా అది ససేమిరా అనడంతో మేయర్ మైకు లేకుండానే తన ప్రసంగం కానిచ్చేశారు. ఆ తర్వాత తాపీగా అధికారులు, ఉద్యోగులు ఒక్కరొక్కరుగా కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో మేయర్ నరేందర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అడిషనల్ కమిషనర్ షాహిద్ మసూద్‌కు ఫోన్ చేసిన కమిషనర్.. మైకు విషయంలో ఏఈ రవీందర్ సస్పెండ్ చేయాలని, డీఈ లక్ష్మారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా నిర్ణీత సమయం 7–30 గంటల్లోగా స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరు కాని అధికారులు, సూపరింటెండెంట్లకు షాకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచిం చారు. ఇక బల్దియా ప్రధాన కార్యాలయం కార్యక్రమం పూర్తయిన తర్వాత కమిషనర్ పబ్లిక్ గార్డెన్‌కు వెళ్లగా ఉద్యానవన అధికారి మినహా ఎవరూ లేరు. దీంతో కమిషనర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించి కనీసం ఆహ్వాన పత్రాలను ముద్రించకుండా కార్పొరేటర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
Advertisement