400 ఏళ్ల ప్రస్థానంతో చారిత్రక, సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుతో ప్రపంచ పటంపై తనదైన ముద్ర వేసుకున్న హైదరాబాద్ మహానగరం.. దేశ యవనికపై మరోసారి తన కీర్తిని చాటనుంది. విశ్వనగరం వైపు వడివడిగా అడుగులేస్తున్న గ్రేటర్ జనాభా కోటికి చేరువైంది.
ప్రధాన నగరం కంటే శివార్లు శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో పాటు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఐటీ, బీపీఓ, కేపీఓ, పారిశ్రామికాభివృద్ధి కారణంగా నగర జనాభా ఆరు దశాబ్దాలుగా అంచెలంచెలుగా పెరుతోంది. జనాభా పెరుగుదల క్రమాన్ని పరిశీలిస్తే ఈ విషయం సుస్పష్టమౌతోంది. 1951లో నగర జనాభా 10.83 లక్షలు మాత్రమే. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా ఏకంగా 78 లక్షలకు చేరింది. ఇక 2015 నాటికి జనాభా కోటికి చేరువైనట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
దేశంలోని పలు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే జనాభా విషయంలో గ్రేటర్ ఆరోస్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీ 4.60 కోట్ల జనాభాతో తొలి స్థానంలో ఉండగా, 2.07 కోట్ల జనాభాతో ముంబై రెండో స్థానంలో ఉంది. ఇక 1.46 కోట్ల జనాభాతో కోల్‌కతా మూడో స్థానంలోను, 89.17 లక్షలతో చెన్నై నాలుగో స్థానం, 87.28 లక్షలతో బెంగళూర్ ఐదో స్థానంలో ఉండగా.. 78 లక్షల జనాభాతో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది.