బస్సుల్లో బలపరీక్ష - నరకం.. నగర ప్రయాణం
మొత్తం బస్సులు 3580
మెట్రో (ఏసీ) 80 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు 1000
ఆర్డినరీ బస్సులు 2500 ప్రస్తుత అవసరం 1000 భవిష్యత్ అవసరం 3000
సమయానికి రావు.. వచ్చినా ఆగవు.. బస్సు కోసం రోడ్డు వెంట పరుగు పందేలు.. కిక్కిరిసిన జనం.. ఆగినా ఎక్కలేని దుస్థితి.. నెట్టుకుంటూ వెళ్లాల్సిందే. ఫుట్‌బోర్డుపై వేలాడుతూ.. గమ్యం చేరే వరకు బిక్కుబిక్కుమనాల్సిందే. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తప్పని బలపరీక్ష. ఎంఎంటీఎస్ తర్వాత నగరంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల కష్టాలు ఇవి. కాలం చెల్లిన బస్సులతో కాలం వెళ్లదీస్తోంది సిటీ ఆర్టీసీ. లక్షల మందిని గమ్యం చేర్చే బస్సుల సామర్థ్యం తగ్గిపోయి ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి.
ఇప్పటికీ 40 శాతం పాత బస్సులే సేవలంది స్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సులు పెంచకపోవడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. వీటితో వేగలేక సిబ్బంది లోనూ అసహనమే కనిపిస్తోంది. కూకట్‌పల్లి-ఎల్బీనగర్ మార్గంలో తిరిగే ఆర్టీసీ సిటీ బస్సులో ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. నిత్యం అనుభవించే మనోవేదనను ఆయా వర్గాలు ప్రత్యక్షంగా 'సాక్షి' తో పంచుకున్నాయి. ఇలాంటి తరుణంలో సిటీలో బస్సుల సమస్యను పరిష్కరించే వారితోనే 'గ్రేటర్' జెండా ఎగరేయిస్తామంటున్నాయి.
సిటీ ఆర్టీసీ బస్సులో ప్రయాణమంటే సాహసమే. గంటల తరబడి స్టాపులో నిలుచుంటే ఎప్పటికో వస్తాయి. ఎక్కుదామనుకుంటే స్టాపులో ఆగకుండానే వెళ్లిపోతాయి. ఓపికున్నవారు పరుగెత్తి పట్టుకుంటారు. లేనివారు తిట్టుకుంటూ ఆటోను నమ్ముకుంటారు. ఇది ప్రయాణికుల అనుభవం. డ్రైవర్ కొలువు కూడా సాహసమే. స్టాపులో బస్సు నిలపలేదన్న సాకుతో చార్జీ మెమో అందుకోవాలి. అక్కడ ఆగి ఉన్న ఆటోలను మాత్రం ఎవరూ తొలగించరు. పని వేళలు ఎనిమిది గంటలే అయినా.. కనీసం 10 గంటలు తక్కువ కాకుండా విధుల్లో ఉండాల్సిందే. ఇందుకు ట్రాఫిక్‌జాం కారణమని వేరే చెప్పనక్కర్లేదు.
రూట్లను బట్టి ఒక్కో డ్రైవర్ రోజుకు 100-150 కిలోమీటర్లు తిరగాలి. గతుకుల రోడ్లలో నడుములు విరిగిపోయి తక్కువ వయసులోనే బస్సులను షెడ్డుకు, దేహాన్ని ఆస్పత్రికి పంపక తప్పడం లేదు. ఇక రాత్రి వేళల్లో మందుబాబులు, ఆకతాయిల నుంచి డ్రైవర్లకు రక్షణ లేని పరిస్థితి. బస్సు నలువైపులా చూస్తూ టిక్కెట్.. టిక్కెట్.. అంటూ పరిగెత్తే కండక్టర్‌కూ ఎన్నో కష్టాలు. ఎస్సార్ సరిగా లేదని అధికారులతో అక్షింతలు. తమ స్టాప్ వద్ద ఆపలేదని ప్రయాణికుల చీవాట్లు. బస్సులు పెంచక, సిబ్బందిని నియమించకపోవడం వల్లే ఈ పరిస్థితి. ఈ నేపథ్యంలో తమ కష్టాన్ని గుర్తించి సమస్యలు పరిష్కరించే వారినే 'గ్రేటర్' పీఠం ఎక్కిస్తామంటున్నారు సిటీజనులు. బస్సుల సమస్యలపై వారేమన్నారో వారి మాటల్లోనే.
సమయమంతా ఎదురు చూపులకే..
నువ్వు ఎక్కాల్సిన బస్సు జీవిత కాలం లేటు’ అన్నాడు ఆరుద్ర. ఇది సరిగ్గా నగర ప్రయాణికులకు సరిపోతుంది. సమయానికి బస్సు రాదు. వచ్చినా కాలు తీసి వేయలేని దుస్థితి మధ్య ప్రయా ణం. నా కోర్సు కోచింగ్ సమయం రెండు గంటలైతే.. సిటీ బస్సు కోసం ఎదురు చూసేది మాత్రం మూడు గంటలు.
- రాంభూపాల్, సివిల్స్ అభ్యర్థి
పడుతూ లేస్తూ ప్రయాణం
సిటీ బస్సుతో నాకు 15 ఏళ్ల అనుబంధం ఉంది. రోజూ పంజగుట్ట నుంచి ఓల్డ్ సిటీకి వెళ్తాను. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో రద్దీ తీవ్రంగా ఉంటోంది. కిలోమీటర్ల పడుతూ లే స్తూ ప్రయాణం సాగించాల్సిందే.
- సయ్యద్, ప్రయాణికుడు
నిత్యం నిలబడాల్సిందే..
పదేళ్ల నుంచి సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నాను. కోచింగ్ నిమిత్తం జీడిమెట్ల నుంచి అబిడ్స్‌కు వెళ్తుంటా. సమయానికి గమ్యం చేరతానన్న నమ్మకం ఎప్పుడూ లేదు. ఒకవైపు ట్రాఫిక్‌జాం, మరోవైపు సరిగా లేని స్టాపులు.. నిత్యం నిలబడి మూడు గంటల బస్సు ప్రయాణం. రాత్రి తొమ్మిది అయితే బస్సుల సంఖ్య మరీ తగ్గిపోతోంది. - నవ్యత, ప్రయాణికురాలు
సాయంత్రం షిఫ్ట్ నరకం..
మార్నింగ్ షిఫ్ట్‌లో డ్యూటీ కాస్త రిలాక్స్‌గా చేసుకోవచ్చు. రెండు గంటల పాటు రద్దీ ఉన్నా ఆ తరువాత పర్వాలేదు. సాయంత్రం షిఫ్ట్ అయితే మాత్రం డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు కిక్కిరిసిన ప్రయాణికులను నెట్టుకొని వెళ్లి టికెట్లు ఇచ్చుకోవాల్సిందే.
- విజయేందర్‌రెడ్డి, సిటీ బస్ కండక్టర్