హరీశ్ లేకుంటే పరువు పోయేది
♦ వరంగల్ కార్పొరేషన్ ఫలితాలపై కేసీఆర్!
♦ ఆ జిల్లా నే తలకు క్లాస్.. పనితీరుపై తీవ్ర అసంతృప్తి
♦ సొంత అభ్యర్థులను ఓడించేందుకు ఖర్చు పెడతారా అంటూ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ నాయకత్వం వేసిన అంచనాలకు, వాస్తవ ఫలితాలకు తేడా ఉండటం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 58 డివిజన్లు ఉన్న వరంగల్‌లో కనీసం 50కిపైగా స్థానాలను గెలుచుకుంటామని భావించినా... 44 డివిజన్లనే గెలుచుకుంది. టికెట్ల ఖరారు నుంచే మొదలైన అసంతృప్తి... చివరకు ప్రతి డివిజన్‌లో రెబెల్స్ పోటీలో ఉండడం దీనికి కారణమైంది. కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఇష్టం లేకుండా పోటీకి దిగిన వారిని ఓడించేందుకు తెరవెనుక మంత్రాంగం నడిచిందన్న సమాచారంతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిఘా విభాగాల ద్వారా నివేదికలు తెప్పించుకున్నారని తెలుస్తోంది. ఆ నివేదికలను పరిశీలించిన కేసీఆర్... నేతలకు ఇష్టం లేకుండా అభ్యర్థులుగా అవకాశం వచ్చిన వారి ని ఓడించేందుకు ప్రయత్నాలు జరి గాయన్న నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ఇటీవల వరంగల్ నేతలను పిలిపించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘‘పార్టీకి పూర్తి స్థాయిలో పట్టున్న వరంగల్ కార్పొరేషన్ ఫలితాలు నిరాశ కలిగించాయి. పార్టీ అభ్యర్థులను ఓడిం చేందుకు పార్టీ నేతలే ఎదురు ఖర్చు పెడతారా..? మంత్రి హరీశ్‌రావు వరంగల్ ఎన్నికల బాధ్యత తీసుకోకుంటే, అక్కడికి రాకుంటే పరువు పోయేది..’’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు, తమను కాదని ఎవరికో టికెట్ ఇస్తే ఎందుకు గెలిపించాలన్న ఉద్దేశంతో పార్టీ పరువును పణంగా పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
పార్టీకి ప్రమాదకరం..
వరంగల్‌లో మేయర్ రేసులో ఉన్న అభ్యర్థిని ఓడించేందుకు కూడా భారీ ప్రయత్నాలు జరిగాయని... ఏకంగా ఓ నేత ఎదుటి పక్షం అభ్యర్థికి ఎన్నికల ఖర్చులు పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మేయర్‌గా ఎన్నికైన న న్నపనేని నరేందర్ గెలిచిన 19వ డివిజన్‌లో ఏకంగా రూ.3కోట్ల పైచిలుకు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు.. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించిన ఇద్దరు అభ్యర్థులు ఓటమి పాలయ్యేందుకు పార్టీ నేతలే కారణమయ్యారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో నాలుగు డివిజన్లు ఉండగా కాంగ్రెస్ గెలుచుకున్న నాలుగు డివిజన్లలో మూడు డివిజన్లు ఇక్కడే ఉన్నాయి. ఓ మంత్రి సూచించిన 46వ డివిజన్ అభ్యర్థిని ఓడించారు. ఒక ఎమ్మెల్యే తన కు ఇష్టం లేని అభ్యర్థులు పోటీలో ఉన్నారని, వారిని ఓడించేందుకు ఏకంగా రూ.50లక్షలు ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది. టికెట్ దొరకక రెబెల్స్‌గా పోటీచేసిన వారిలో 8 మంది గెలుపొందగా... పార్టీ అధికారిక అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఇక భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవులకు తమకు ఎక్కడ పోటీ వస్తారోనని భావించి ఓ ముగ్గురు నాయకులకు అసలు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌లో చోటు చేసుకున్న ఈ పరిణామాలు పార్టీకి ఒక విధంగా ప్రమాద ఘంటికలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.