మేయర్ ఎవరు
పదవి కోసం నేతల ప్రయత్నాలు
అధిష్టానం పరిశీలనలో నన్నపనేని నరేందర్
గుండా ప్రకాశ్ అభ్యర్థిత్వంపైనా చర్చలు
తూర్పు నియోజకవర్గానికే అవకాశాలు
15న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల కీలక ఘట్టం ముందుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఈ నెల 15న జరగనున్నాయి. వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్‌ఎస్ నుంచి మేయర్ ఎవరు అవుతారనేది ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ వరంగల్‌లోని మొత్తం 58 డివిజన్లలో టీఆర్‌ఎస్ 44 స్థానాల్లో విజయం సాధించింది. టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి దక్కకపోవడంతో రెబల్స్‌గా బరిలోకి దిగిన వారిలో ఎనిమిది మంది గెలిచారు. ఈ ఎనిమిది మంది త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది. దీంతో టీఆర్‌ఎస్ బలం మరింత పెరగనుంది. ఇలా టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ ఉండడంతో మొదటిసారి క్యాంపు రాజకీయాలు లేకుండా వరంగల్ మేయర్ ఎన్నిక జరుగుతోంది. మేయర్ పదవిని ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమదైన శైలిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్య నేతలు టి.హరీశ్‌రావు, కె.టి.రామారావులతోపాటు జిల్లాలోని కీలక నేతల వద్దకు వెళ్లి తమ కోరికను తెలియజేస్తున్నారు. మేయర్ పదవిని ఎవరికి అప్పగించాలనే విషయంలో టీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది. గ్రేటర్ వరంగల్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ 19 డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన నన్నపనేని నరేందర్ పేరు మేయర్ పదవికి ప్రధానంగా వినిపిస్తోంది. టీఆర్‌ఎస్‌లో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన గర్తింపు నన్నపనేనికి ఉంది. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ వరంగల్ రీజియన్ గౌరవ అధ్యక్షుడిగా నరేందర్ పని చేస్తున్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నన్నపనేనికి అవకాశం వచ్చేది. కొండా సురేఖ, మురళీ టీఆర్‌ఎస్‌లోకి రావడంతో వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ సురేఖకు దక్కింది. దీంతో పార్టీ అధిష్టానం నన్నపునేని నరేందర్‌కు గ్రేటర్ వరంగల్ టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవిని ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ గెలుపు కోసం నరేందర్ కీలకంగా పని చేశారు. గత ఏడాది జరిగిన టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో నన్నపనేనికి మరోసారి గ్రేటర్ అధ్యక్ష పదవి వచ్చింది. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి లక్ష్యంగా నరేందర్ 19వ డివిజన్‌లో పోటీ చేశారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థితో నరేందర్‌కు తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్సీ కొండా మురళి.. గంటా రవికుమార్‌కు సహకరించారనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. నరేందర్ చివరికి 881 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు తాజా ఎన్నికల్లో 26వ డివిజన్‌లో గెలిచిన గుండా ప్రకాశ్‌రావు మేయర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పని చేయడం, మేయర్ జనరల్ కేటగిరీకి కేటాయించడం అంశాలను అనుకూలంగా భావించి ప్రకాశ్‌రావు మేయర్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ నగరంలో కీలకమైన వ్యాపార సామాజికవర్గానికి చెందిన ప్రకాశ్‌రావు పేరును టీఆర్‌ఎస్ అధిష్టానం పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఆయన26వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి రత్నం సతీష్‌షాపై 1560 ఓట్ల మెజారిటీతో గెలిచారు.