నోరు జారిన మేయర్
► రసాభాసగా నగరపాలక మండలి సమావేశం
► ప్రజా సమస్యలపై గళమెత్తిన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు
► వ్యక్తిగత ఆరోపణలకు దిగిన టీడీపీ సభ్యులు
► ఏకగ్రీవంగా కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక
నెల్లూరు (పొగతోట) : నెల్లూరు నగర ప్రథమ పౌరుడు దూషణలకు దిగారు. ‘యే.. చ్చా పో.. చీ.. పో.. చ్చా కూర్చో.. యే బయటకు పో’ అంటూ ప్రతిపక్ష కార్పొరేటర్లపై విరుచుకుపడ్డారు. నగరపాలక మండలి అత్యవసర సమావేశం మేయర్ అబ్దుల్ అజీజ్ అధ్యతన నగరపాలక మందిరంలో గురువారం జరిగింది. 11 నెలల అనంతరం నగరపాలక కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం సమావేశం నిర్వహించగా.. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్సార్ సీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమావేశానికి హాజరయ్యారు.
కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసినట్టు మేయర్ అజీజ్ ప్రకటించగా.. వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ పి.రూప్‌కుమార్ యాదవ్ కలగజేసుకుని.. ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం దారుణమన్నారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి 11 నెలలు దాటుతోందని, ప్రజా సమస్యలపై చర్చిందుకు సమావేశం ఏర్పాటు చేయాలని పట్టుపట్టారు. ఈ దశలో మేయర్ పైవిధంగా దూషణకు దిగారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ కమిషనర్ ఢిల్లీరావుకు నోటీసు ఇచ్చినా ఫలితం లేకపోయిందని రూప్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేయగా.. మేయర్ నోరు జారారు.
దీంతో వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. వైఎస్సార్ సీపీ సభ్యులంతా ఏకమై ప్రజా సమస్యలపై చర్చించాలని పట్టుపట్టారు. సమాధానం చెప్పలేక మేయర్ ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ దశలో టీడీపీ సభ్యులు రూప్‌కుమార్‌ను చుట్టుముట్టడంతో యుద్ధవాతావరణం నెలకొంది. వైఎ స్సార్ సీపీ కార్పొరేటర్లు దామవరపు రాజశేఖర్, దేవరకొండ ఆశోక్ తదితరులు టీడీపీ సభ్యులను అడ్డుకునే యత్నం చేయగా.. మేయర్ పోలీసులను పిలిచి ప్రతిపక్ష సభ్యులు బయటకు పంపిం చాలని ఆదేశించారు. ఈ దశలో రూప్‌కుమార్ యాదవ్ సభ్యులకు నచ్చచెప్పి అందరినీ శాంతింప చేశారు.
ఆయన మాట్లాడుతూ నగర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగి ప్రజ లు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా మారడంతో ప్రజలు విషజ్వరాలతో అల్లాడుతున్నారని వివరించారు. నిబంధనల ప్రకారం మూ డు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాల్సి ఉండగా పట్టించుకోవడం లేద ని వాపోయారు. డిప్యూటి మేయర్ ము క్కాల ద్వారకానా«థ్ మాట్లాడుతు సమస్యలపై చర్చిందుకు తప్పకుండా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కార్పొరేటర్ బి.పద్మజ మాట్లాడుతూ సమస్యల్ని విస్మరించి కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం సమావేశం ఏర్పాటు చేయడం మంచిపద్ధతి కాదన్నారు. సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ డీల్లీరావు హామీ ఇవ్వడంతో పరిస్థితి చక్కబడింది.
కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక
సమావేశంలో ఐదుగుర్ని కో–ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. స్వర్ణ వెంకయ్య, ఓం ప్రకాష్‌యాదవ్, మండ్ల కామక్షి, మైనార్టీ నాయకుడు మహమ్మద్ జరీనా సుల్తానా, బిర్మాల్ జైన్ ఎన్నిక కాగా.. వారిని మేయర్, అన్ని పార్టీల కార్పొరేటర్లు అభినందించారు.