ఎన్నికల్లో అలాగే..! | Contribution to the violation of the election code | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో అలాగే..!

Published Tue, Mar 8 2016 1:27 AM | Last Updated on Tue, Aug 21 2018 12:18 PM

ఎన్నికల్లో అలాగే..! - Sakshi

ఎన్నికల్లో అలాగే..!

సుబేదారి స్టేషన్ సీఐ తీరే వేరు
ఉప ఎన్నికలో కాంగ్రెస్ వారికి స్వాగతం
ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సహకారం
ఇప్పటికీ చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు

 
 వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసుల కోసం బలవంతంగా వాహనాలను సేకరించిన సుబేదారి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిన నరేందర్ విషయంలో పోలీసులు ఉన్నతాధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆయన ఎన్నికల సమయాల్లో విధులు నిర్వహించే తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంటోంది. 2015 నవంబరులో జరిగిన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక  సమయంలో కాంగ్రెస్ నేతలు నిబంధలను ఉల్లంఘించడానికి కారణమై విమర్శలపాలయ్యూరు. ఉప ఎన్నికల సమయంలో కలెక్టరేట్‌లో జరిగిన నామినేషన్ దాఖలు ప్రక్రియ శాంతిభద్రతలను సీఐ నరేందర్ పర్యవేక్షించారు. ఎన్నికల నియమావళి అమలయ్యేలా చూడాల్సిన నరేందర్.. గుంపుగా వచ్చిన కాంగ్రెస్ నేతలకు స్వాగతం చెప్పినంత పని చేశారు.

అప్పట్లో ఈ సంఘటన చర్చనీయాంశమైంది. సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా నవంబరు 2న నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు పొన్నాల లక్ష్మయ్య, నాయిని రాజేందర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్, గండ్ర వెంకటరమణారెడ్డి, మరో 25 మంది నేతలతో కలిసి వచ్చి రాజయ్య నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ఐదుగురు నేతలే వెళ్లినప్పటికీ మిగిలిన 25 మంది నేతలు కలెక్టరేట్ ఆవరణలోకి వెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ మొదటి గేటు మూసి పెట్టినా ఈ నేతలంతా లోపలికి వెళ్లారు. కలెక్టరేట్ వద్ద విధులు నిర్వహించిన ఇన్‌స్పెక్టర్ నరేందర్ వీరిని నిరోధించకుండా అందరినీ నవ్వుతూ లోపలికి పంపించారు. నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగియగానే ముఖ్యనేతలు బయటికి వచ్చారు. అందరూ ఒకేచోట గుంపుగా చేరడంతో ఏదో హడావుడి జరుగుతోందని గమనించిన అదనపు ఎన్నికల అధికారి (డీఆర్వో) శోభ బయటికి వచ్చారు. ఎక్కువ మంది నేతలు లోపలికి వచ్చిన విషయాన్ని గుర్తించారు. అక్కడ విధుల్లో ఉన్న సుబేదారి స్టేషన్ అధికారి నరేందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నియమావళి అమలు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియను అమలు చేసే కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనే ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు గురికావడం ఉన్నతాధికారులకు ఇబ్బందికరంగా మారింది. జిల్లా కలెక్టర్ వి.కరుణ వెంటనే ఈ సంఘటన పూర్వాపరాలను పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబుకు తెలియశేశారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సుబేదారి స్టేషన్ అధికారి నరేందర్ కారణంగానే ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగిందని గుర్తించారు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు.
 
అదే అలుసుగా...
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేందుకు కారణమైనా ఎలాంటి చర్యా లేకపోవడంతో సుబేదారి సీఐ నరేందర్ తీరు మారలేదు. తాజా గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇదే రీతిలో వ్యవహరించారు. ఎన్నికల నిర్వహణ కోసం బలవంతంగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఉపాధి కోసం రవాణా వాహనాలను నడిపే వారిపై జులుం ప్రదర్శించి ఎన్నికల విధులకు వీటిని వినియోగించుకున్నారు. దీనిపై విమర్శలు వచ్చినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement