హైదరాబాద్: పబ్ యజమానిని మామూళ్ళ కోసం పీడించి వేధించిన ఘటనలో ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడ్డ బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ నరేందర్, ఎస్‌ఐ నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిని శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 12 మంది సభ్యులతో కూడిన ఏసీబీ బృందం ప్రశి్నంచింది. పలు రికార్డులను, ఫోన్ కాల్, వాట్సాప్ రికార్డులు వారి ముందే పరిశీలించారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు ఏకధాటిగా వీరిపై ప్రశ్నలు వర్షం కురిపించారు. తనను వేధిస్తున్నట్లు ఆరోపించిన బంజారాహిల్స్‌లోని రాక్ క్లబ్ పబ్ యజమానిని అర్ధరాత్రి ఒంటిగంటకు స్టేషన్‌కు పిలిపించారు.
గత శనివారం పబ్ నుంచి తనను ఎలా తీసుకొచ్చింది, ఎలా నిర్బం«ధించింది పబ్ యజమాని లక్ష్మణ్ రావు ఏసీబీ అధికారులకు పూసగుచ్చినట్లుగా వివరించారు. అకారణంగా తనను పబ్‌నుంచి తీసుకొచ్చారని, అంతకు కొద్ది రోజుల ముందు నుంచే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చాటింగ్ వివరాలను ఆధారాలతో సహా ఏసీబీకి అందజేశారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. సీఐ నరేందర్, ఎస్‌ఐ నవీన్‌రెడ్డి వాట్సాప్ మెసేజ్‌లతో పాటు వాట్సాప్ కాల్స్ వివరాలను కూడా అధికారులు తెప్పించి..వారి ముందే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఈ ముగ్గురినీ ఏసీబీ కార్యాలయానికి తరలించి 41ఏ నోటీసులు అందజేశారు. ఈ నెల 9వ తేదీన తదుపరి విచారణకు హాజరుకావాల్సిందిగా సూచించారు. అక్కడి నుంచే సీఐతో పాటు ఎస్‌ఐ క్యాబ్‌లు బుక్ చేసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు.
మొదలైన పైరవీలు..
బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ నరేందర్‌పై ఏసీబీ ఆరోపణలు రావడంతో దాదాపు ఆయనను పదవి నుంచి తొలగించడం ఖాయంగా కనిపిస్తున్నది. అప్పుడే ఈ పోస్టు కోసం కొందరు సీఐలు పైరవీలు మొదలు పెట్టారు. సమర్ధుడైన అధికారిని రాజకీయాలతో సంబంధం లేకుండా పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ ప్రలోభాలతో స్టేషన్ పరువు ప్రతిష్టలు దిగజారుతున్నట్లుగా అధికారులకు భారీగా ఫిర్యాదులు అందాయి. రాజకీయ నాయకుల ప్రమేయంతో పోస్టింగ్‌లు దక్కించుకుంటున్న సీఐలు తమను ఎవరూ ఏమి చేయలేరనే ధీమాతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా నిఘా వర్గాల నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో బంజారాహిల్స్ పోస్టింగ్ నేరుగా ఇవ్వాలని, రాజకీయ నాయకులకు తలొగ్గద్దని భావిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు సీనియర్ ఇన్‌స్పెక్టర్లు ఇక్కడికి వచ్చేందుకు పోలీసు అధికారులతోనే పైరవీ చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment